మూసాపేట్​సర్కిల్ లో  అధికారులు డీడీల గోల్​మాల్​

మూసాపేట్​సర్కిల్ లో  అధికారులు డీడీల గోల్​మాల్​
  •     మూసాపేట్​సర్కిల్ లో  అధికారులు డీడీల గోల్​మాల్​
  •     కమిషనర్ లోకేశ్​ కుమార్​కు కార్పొరేటర్ల కంప్లయింట్

హైదరాబాద్, వెలుగు: బల్దియాలో ఇంటిదొంగలు తయారయ్యారు.  కాంట్రాక్టర్లు పెట్టే  సెక్యూరిటీ  డిపాజిట్​ డీడీలను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారు. కాంట్రాక్టర్లు వర్క్​ పూర్తి చేసిన తర్వాత అమౌంట్​వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డీడీలను కార్పొరేషన్​ ఖాతాలో డిపాజిట్ చేయకుండా.. కాంట్రాక్టర్లకు తిరిగి ఇవ్వకుండా మధ్యలో అధికారులు కాజేస్తున్నారు. ఈ డీడీలు కమిషనర్ పేరుతో  ఉంటుండగా ఇదే ఛాన్స్​ అనుకొని ప్రాపర్టీ ట్యాక్స్​చెల్లిస్తున్న వారి నుంచి డబ్బులు తీసుకుంటూ   ఇచ్చేస్తున్నారు. మళ్లీ వారి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్ట్ చేసి డిపాజిట్లు చేస్తున్నట్లు  బల్దియాకు లెక్కలు చూపుతున్నారు.  ఒక్క మూసాపేట్ సర్కిల్​లోనే దాదాపు కోటి రూపాయలకు పైగా డీడీలు గోల్ మాల్ ​అయినట్లు మూసాపేట్, మల్కాజిగిరి కార్పొరేటర్లు మహేందర్, శ్రావణ్ ఆరోపించారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు కోవాలంటూ సోమవారం కమిషనర్ లోకేశ్ కుమార్​ కు కార్పొరేటర్లు కంప్లయింట్​ చేశారు.

కేటీఆర్​ శాఖలోనే అవినీతి

కార్పొరేటర్లు మహేందర్, శ్రావణ్ మాట్లాడుతూ కొందరు అధికారుల అవినీతి వల్లే  బల్దియా మరింత నష్టాల్లోకి వెళుతుందని  ఆరోపించారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు  తీసుకుంటేనే మరోసారి ఇలా జరగదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ శాఖలోనే ఇలాంటి గోల్​మాల్​నడుస్తుందని  విమర్శించారు. చర్యలు తీసుకోకపోతే స్టేట్ విజిలెన్స్​ కు కంప్లయింట్ చేస్తామని చెప్పారు. కమిషనర్​ దృష్టికి కూడా  వచ్చినట్లు, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఓ సర్కిల్​స్థాయిలో ఇంత అవినీతి జరుగుతుందంటే స్టేట్​ లెవల్​లో ఇంకెలా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు. బల్దియాలోని అన్ని సర్కిళ్లలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకొని సంస్థను కావాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.