రైస్‌‌ మిల్లులకు నోటీసులు..వడ్లు అన్‌‌లోడ్‌‌ చేసుకోవడం లేదని, తూకం విషయంలో తేడాలు ఉంటున్నాయని ఆరోపణలు

రైస్‌‌ మిల్లులకు నోటీసులు..వడ్లు అన్‌‌లోడ్‌‌ చేసుకోవడం లేదని, తూకం విషయంలో తేడాలు ఉంటున్నాయని ఆరోపణలు
  • నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు, 24 గంటల్లో అన్‌‌లోడ్‌‌ పూర్తి చేయాలని ఆదేశాలు
  • కొనుగోళ్లు జరగడం లేదని జనగామలో ఆర్డీవోను అడ్డుకున్న రైతులు

జనగామ, వెలుగు : వడ్ల అన్‌‌లోడ్‌‌, తూకం విషయంలో జనగామ జిల్లాలోని రైస్‌‌ మిల్లులకు ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా వడ్ల కొనుగోళ్లు జరుగకపోగా.. తాలు, ఇతర కారణాలు చూపుతూ తూకం ఎక్కువ వేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. జిల్లాలోని 234 సెంటర్లలో ఇప్పటివరకు 60 వేల టన్నులు కొని.. 50 వేల టన్నుల వరకూ మిల్లులకు పంపించారు. కానీ మిల్లుల్లో లారీలను అన్‌‌లోడ్‌‌ చేయకపోవడంతో రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు పేరుకుపోతున్నాయి.

వడ్లను ఆన్‌‌లోడ్‌‌ చేయకపోవడం, తూకం ఎక్కువ వేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కలెక్టర్‌‌ సందీప్‌‌కుమార్‌‌ ఝూ పలు మిల్లులకు సుమోటోగా నోటీసులు జారీ చేశారు. సీఎంఆర్‌‌ కేటాయింపులు పొందిన మిల్లర్లు 24 గంటల్లోపు లారీలను అన్‌‌లోడ్‌‌ చేయాలని నోటీసుల్లో ఆదేశించారు. తూకం, క్వాలిటీ పరీక్షలు నిర్వహించి అదే రోజు పోర్టల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయాలని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలు రూల్స్‌‌ ఉల్లంఘిస్తే సీఎంఆర్ కేటాయింపుల రద్దు చేయడంతో పాటు మిల్లులను బ్లాక్‌‌లిస్ట్‌‌లో పెడతామని, సెక్యూరిటీ డిపాజిట్‌‌ జప్తు చేస్తామని హెచ్చరించారు. 

ఆర్డీవోను అడ్డుకున్న రైతులు

జనగామ మార్కెట్‌‌లో వడ్ల కొనుగోలును పరిశీలించేందుకు వచ్చిన ఆర్డీవో గోపీరాంను రైతులు అడ్డుకున్నారు. లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని, అకాల వర్షాలకు వడ్లు తడుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో వేగం పెంచుతామని ఆర్డీవో చెప్పినా రైతులు పట్టించుకోకుండా... ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆర్డీవో ఓ వ్యక్తిని పిలిపించుకొని బైక్‌‌పై వెళ్లిపోయారు. 

లారీ డ్రైవర్‌‌ ఆత్మహత్యాయత్నం

జనగామ వ్యవసాయ మార్కెట్‌‌లో ఓ లారీ డ్రైవర్‌‌ ఆత్మహత్యకు యత్నించాడు. తడిసిన వడ్లను మిల్లుకు తరలించేందుకు లారీ డ్రైవర్‌‌ అబ్దుల్‌‌ బషీర్‌‌ సోమవారం మార్కెట్‌‌కు వచ్చాడు. దీంతో వడ్లు తీసుకెళ్లడానికి రోజుల తరబడి ఎందుకు రావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బషీర్‌‌ లారీపైకి ఎక్కి గొంతుకు తాడు బిగించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. హమాలీ కార్మికుడు రాజు వెంటనే పైకి ఎక్కి డ్రైవర్‌‌ను కిందికి దించాడు.