కొనుగోళ్లపై నజర్..​ సర్కారు కేంద్రాల్లో వేగంగా కొనేలా చర్యలు

కొనుగోళ్లపై నజర్..​ సర్కారు కేంద్రాల్లో వేగంగా కొనేలా చర్యలు
  •     మిల్లర్లకు, సెంటర్ నిర్వాహకులకు హెచ్చరికలు
  •     నిత్యం కలెక్టర్, అడిషనల్​కలెక్టర్ల రివ్యూలు, సెంటర్ల సందర్శనలు​

జనగామ, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై ఆఫీసర్లు ప్రత్యేక నజర్​పెట్టారు. జనగామ అగ్రికల్చర్ ​మార్కెట్​యార్డులో ధాన్యాన్ని అగ్వకు కొంటున్నారనే కారణంతో ముగ్గురు ట్రేడర్లపై క్రిమినల్​ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులు సంగతి తేలే వరకు ధాన్యం కొనేది లేదని మిగతా వ్యాపారులు తెగేసి చెప్పేయడంతో అధికారులు సర్కారు కేంద్రాల నిర్వాహకులను అప్రమత్తం చేశారు. 

ప్రత్యామ్నాయంగా సెంటర్లను పెంచి, కొనుగోళ్లలో వేగం పెంచారు. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 195 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మార్కెట్​యార్డు ఆవరణలో రెండు సర్కారు సెంటర్లను ఏర్పాటు చేసి, సెలవు రోజుల్లోనూ విక్రయాలు జరుపుతున్నారు. గురువారం వరకు జిల్లాలో 627 మెట్రిక్​ టన్నుల ధాన్యం మాత్రమే కొనగా, శుక్రవారం ఒక్కరోజే 886 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రాల ద్వారా సేకరించారు. మొత్తంగా ఇప్పటి వరకు 1513 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొన్నారు.

తనిఖీలతో అలెర్ట్...

ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం రేవంత్​రెడ్డి సీరియస్​గా ఉండడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్​రిజ్వాన్ బాషాషేక్, అడిషనల్​ కలెక్టర్​రోహిత్​సింగ్ జిల్లాలోని పలు సెంటర్లను క్షేత్రస్థాయిలో విజిట్ చేస్తున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ధాన్యాన్ని సర్కారు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచిస్తున్నారు. ఇదే క్రమంలో మిల్లర్లతో అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ రోజారాణి, డీఎం ప్రసాద్ కలిసి శనివారం సమావేశం నిర్వహించారు. ధాన్యం కోతల రూపంలో ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎంఆర్ రైస్ లక్ష్యాలను నిర్ణీత టైంలో చేరుకోవాలని ఆదేశాలిచ్చారు.

1513 టన్నుల కొనుగోలు..

కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,203, కామన్ రకానికి రూ.2,183 మద్దతు ధర కల్పిస్తున్నది. జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 1513 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 1100ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు రూ.3 కోట్ల 23 లక్షలను రైతులకు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు ఆఫీసర్లు చెప్పారు.​ ఇదిలాఉండగా, కాంటాలు మొదలు కాని గ్రామాల్లో వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మూడు రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు.