మైనర్​ పెండ్లిని అడ్డుకున్న ఆఫీసర్లు.. అధికారులను తోసేసి బాలికతో పరార్

మైనర్​  పెండ్లిని అడ్డుకున్న ఆఫీసర్లు.. అధికారులను తోసేసి బాలికతో పరార్

మెదక్ (శివ్వంపేట), వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భోజ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ బాలిక పెండ్లిని చైల్డ్​వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లు అడ్డుకున్నారు. అయితే, అధికారులను అడ్డుకున్న బంధువులు బాలికను తీసుకొని పరారయ్యారు. భోజ్య తండాలో బుధవారం రాత్రి ఓ బాలికకు పెండ్లి చేస్తున్నారని సమాచారం రాగా, డీసీపీఓ కరుణ శీలా తన సిబ్బంది, పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు.

మేజర్​ కాకుండా పెండ్లి చేయడం తప్పని, ఎన్నో సమస్యలు వస్తాయని బాలిక తల్లిదండ్రులు, బంధువులకు అవగాహన కల్పించారు. వినిపించుకోని బంధువులు, తండావాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే బాలిక బంధువులు ఆమెను తీసుకొని పరుగందుకున్నారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆఫీసర్లను తోసేసి పరారయ్యారు. పోలీసులు ఉన్నా లెక్క చేయలేదు.  ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని డీసీపీఓ తెలిపారు. గురువారం తండాకు వెళ్లి చూస్తే, బాలిక ఇంటికి తాళమేసి  ఉందని చెప్పారు.