ఉన్నతాధికారుల ఆదేశంతో రెచ్చిపోతున్న అధికారులు

ఉన్నతాధికారుల ఆదేశంతో రెచ్చిపోతున్న అధికారులు
  • వెయ్యి నుంచి 2 వేల మందికి నోటీసులు
  • అప్పటికీ పన్ను కట్టకుంటే దుకాణాలు బంద్
  • కొద్ది రోజులు టైం ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరించని ఆఫీసర్లు
  • 15 రోజుల్లో 467 కోట్లు వసూలు చేసేందుకు హడావుడి

హైదరాబాద్, వెలుగు : ప్రాపర్టీ ట్యాక్స్​ వసూలుపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్​గా వ్యవహరిస్తున్నారు. పన్ను చెల్లించని ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ముందుగా పన్ను చెల్లించాలని రెడ్  నోటీసు జారీ చేస్తున్నారు. ఆ తర్వాత 15 రోజుల టైమ్ ఇచ్చి వారెంట్ నోటీసు పంపుతున్నారు. అప్పటికీ పన్ను చెల్లించకపోతే కమర్షియల్ భవనాల్లో కొనసాగుతున్న షాపులను సీజ్ చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇలా గ్రేటర్​లోని అన్ని జోన్లలో ఇప్పటికే వెయ్యి నుంచి రెండువేల మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆదేశించడంతో సర్కిల్ స్థాయి అధికారులు రెచ్చిపోతున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 15 రోజులు మాత్రమే టైమ్ ఉండడంతో ఆస్తి పన్ను వసూలుపైనే ఫోకస్ పెట్టారు. జీహెచ్ఎంసీ ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ఆస్తి పన్ను వసూలుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పన్నులు రాబట్టేందుకు కొత్త మార్గాలను సైతం ఎంచుకుంటున్నారు. ప్రాపర్టీలను సీజ్ చేసిన తర్వాత డబ్బులు లేవని, కొంత సమయం ఇవ్వాలని ప్రాపర్టీదారులు కోరుతుండగా.. వారి నుంచి అడ్వాన్స్​గా  చెక్కులు తీసుకుంటున్నారు. అనంతరం షాపులను తిరిగి తెరుస్తున్నారు. 

టార్గెట్ 2 వేల కోట్లు, వచ్చినవి 1533 కోట్లు

జీహెచ్ఎంసీ కమిషనర్, ఫైనాన్స్​ అడిషనల్​ కమిషనర్లు ఆస్తిపన్ను వసూలుపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు పన్నుల వసూళ్లపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2 వేల  కోట్లు టార్గెట్  పెట్టుకోగా మంగళవారం నాటికి రూ.1,533 కోట్ల ఆదాయం వచ్చింది. మరో రూ.467 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సర్కిల్  అధికారులను ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. జీహెచ్ఎంసీకి నెలకు వివిధ పన్నుల రూపంలో రూ.300 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో అత్యవసరమైన పేమెంట్లు మాత్రమే చేసినా ఉద్యోగుల జీతాలకు మిగలని పరిస్థితి నెలకొంది. దీంతో ఆదాయ మార్గమైన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. పన్ను వసూలుకు 15 రోజుల సమయం మాత్రమే ఉండడంతో రూ.467 కోట్లు రాబట్టేందుకు వేగం పెంచారు. 

ఓనర్లు, కిరాయిదారుల మధ్య గొడవ

ఆస్తి పన్ను చెల్లించని ఓనర్ల ప్రాపర్టీలను అధికారులు సీజ్ చేస్తుండడంతో బిజినెస్ చేసుకుంటున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెలా రెగ్యులర్​గా అద్దె చెల్లించి వ్యాపారం చేసుకుంటున్న తమ షాపులను సీజ్​ చేస్తే బిజినెస్ ఎలా చేసుకోవాలని కిరాయిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కిరాయిదారులు ఓనర్లతో గొడవలకు దిగుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఓనర్ల వద్దే పన్ను వసూలు చేసుకోవాలని, షాపులు సీజ్ చేస్తే తాము నష్టపోతున్నామని వాపోతున్నారు.

సిబ్బందికి మెమోలు జారీ

 ఎలాగైనా కలెక్షన్లు తీసుకురావాలని కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పన్ను వసూలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పలువురు ఉద్యోగులకు మెమోలు సైతం  జారీ చేశారు. ప్రజలు పన్నులు చెల్లించకపోతే తాము ఏం చేస్తామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం గడువు దగ్గర పడుతుండటంతో ఎలాగైనా పన్ను వసూలు చేయాలని బిల్ కలెక్టర్లతో పాటు ఇతర ఆఫీసర్లనూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ చెల్లించని వారి ఆస్తులను అధికారులను సీజ్ చేస్తున్నారు. కొద్ది రోజులు టైమ్ ఇవ్వాలని వేడుకుంటున్నా కనికరించడం లేదు.