సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్

సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్
  • మళ్లీ మొదటి నుంచి వార్డుల విభజన
  • రాబోయే 14 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి
  • ఓటర్ల జాబితా ప్రకటన, రిజర్వేషన్లకు మరో 14 రోజులు
  • డిసెంబర్‌ నెలాఖరుకు ప్రీపోల్‌ ప్రాసెస్‌ కంప్లీట్‌
  • వచ్చే ఏడాది తొలి వారంలో నోటిఫికేషన్‌.. 15 రోజుల్లో పోలింగ్‌

హైదరాబాద్‌, వెలుగు:

జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రీ పోల్‌ ప్రాసెస్‌ను వేగవంతం చేశారు. ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు సింగిల్‌ జడ్జి శుక్రవారం అనుమతి ఇవ్వడంతో.. మధ్యాహ్నమే సీడీఎంఏ ఆఫీసులో అధికారులు సమావేశమై ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే మున్సిపల్‌ కమిషనర్లకు వర్కింగ్‌ మ్యానువల్స్‌ పంపిణీ చేశారు. డిసెంబర్‌ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని, జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చే చాన్స్‌ ఉందని అధికారులు చెప్పారు.

కొన్ని మున్సిపాలిటీలు మినహా..

రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీతోపాటు గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపల్‌ పాలకవర్గాల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. షెడ్యూల్డ్‌ ఏరియాల్లోని మణుగూరు, పాల్వంచ, మందమర్రి మున్సిపల్‌ ఎన్నికలపై కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. నకిరేకల్‌, జడ్చర్ల మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తి కాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్ల లిస్టులో లేని మీర్‌పేటలో కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు మీర్‌పేటలోనూ వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రకటన, రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు శుక్రవారమే నిర్ణయం తీసుకున్నారు.

అన్ని వార్డులూ డీలిమిటేషన్‌

కరీంనగర్‌, రామగుండం, నిజామాబాద్‌, బడంగ్‌పేట్‌, బండ్లగూడ జాగీర్‌, మీర్‌పేట, బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట కార్పొరేషన్లతో పాటు 121 మున్సిపాలిటీల్లో కొత్తగా వార్డుల పునర్విభజన చేయనున్నారు. ఈ ప్రక్రియను ఆయా కార్పొరేషన్లు, మున్సిపల్‌ కమిషనర్లు శుక్రవారమే మొదలుపెట్టారు. 14 రోజుల్లోగా డీలిమిటేషన్‌ ప్రాసెస్‌ కంప్లీట్‌ చేస్తారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వార్డులపై అభ్యంతరాలను డీలిమిటేషన్‌ ప్రాసెస్ సమయంలో మొదటి వారం రోజుల్లో స్వీకరిస్తారు. అన్ని వార్డుల్లో నాలుగు దిక్కులు ఉండేలా క్లాక్‌ వాచ్‌ మోడల్‌ను విధిగా పాటిస్తారు. ఇది పూర్తయిన తర్వాతి ఏడు రోజుల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలను క్లారిఫై చేశాక.. వార్డులవారీగా రిజర్వేషన్ల ప్రక్రియను మొదలు పెడతారు. గరిష్టంగా ఏడు రోజుల్లోగా జనరల్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ వార్డులను ప్రకటిస్తారు. ఆయా కేటగిరీలకు కేటాయించిన వార్డుల నంబర్లను చీటిపై రాసి డ్రా తీస్తారు. ఇలా డ్రాలో వచ్చిన వార్డులను మహిళలకు కేటాయిస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం వార్డులను మహిళలకు కేటాయిస్తారు.

డిసెంబర్‌ నెలాఖరుకు అంతా సిద్ధం

ప్రీ పోల్‌ ప్రాసెస్‌ మొత్తాన్ని డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు మున్సిపల్‌ అధికారులు రెడీ కానున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన రిజర్వేషన్ల వివరాలను ఆ వెంటనే రాష్ర్ట ఎన్నికల సంఘానికి అందజేస్తారు. కోర్టు స్టే ఎత్తివేసిన 45 రోజుల్లోనే ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తామని కోర్టుకు ఎన్నికల సంఘం లాయర్‌ నివేదించారు. ఈ లెక్కన సంక్రాంతికి ముందే పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే పండుగ తర్వాతే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. మొదటి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చి, 15వ రోజున పోలింగ్‌ నిర్వహిస్తారు. జనవరి 20 నాటికి పోలింగ్‌ పూర్తి చేసేలా మున్సిపల్‌, రాష్ర్ట ఎన్నికల సంఘం వర్గాలు సిద్ధమవుతున్నాయి.

ఎలక్షన్ ప్రాసెస్​పై మ్యానువల్స్‌

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే మున్సిపల్‌ కమిషనర్లకు వర్కింగ్‌ మ్యానువల్స్​ను సీడీఎంఏలో అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సమగ్ర సమాచారాన్ని ఈ బుక్‌లెట్లలో ప్రింట్‌ చేశారు. ఏయే అంశాలను ఎలా డీల్‌ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొత్త మున్సిపల్‌ యాక్ట్‌లోని కీలకాంశాలు, ఎన్నికల నిర్వహణలో వాటి ప్రాధాన్యాన్ని వివరించేలా బుక్‌లెట్లను రూపొందించారు. ఇప్పటికే ఎలక్షన్‌ అథారిటీలను, అబ్జర్వర్లను ఈసీ నియమించింది. వారికి మరో విడత ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. రిజర్వేషన్ల వివరాలు ఇచ్చి, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఈసీ రెడీ అవుతోంది.

పోలింగ్‌ కేంద్రాల జాబితా పంపండి

మున్సిపల్ కమిషనర్లకు రాష్ర్ట ఈసీ ఆదేశం

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ కేంద్రాల జాబితా పంపాలని మున్సిపల్‌ కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహిస్తే.. ఒక్కో బూత్‌లో 1,200 మంది ఉండేలా, బ్యాలెట్‌ బాక్సులతో ఎన్నికలకు వెళ్తే.. 800 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని సూచించింది. ఆయా మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల వివరాలను నిర్దేశిత ఫార్మాట్‌లో తమకు పంపాలని కోరింది. ఒక కిలోమీటర్​కు మించి దూరం ఉన్న పోలింగ్‌ స్టేషన్ల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనాలని, ఆయా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేది ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లోనా, టెంపరరీ స్ర్టక్చర్స్​లోనా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారులు సిద్ధం చేసిన జాబితాను సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల ఆమోదించిన తర్వాత తమకు పంపాలని సూచించింది. రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఇచ్చే జాబితా ఆధారంగా తాము ఫైనల్‌ లిస్ట్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో పబ్లిష్‌ చేస్తామని పేర్కొంది.

Officials are making arrangements to hold municipal elections in January