కలుషిత నీరు వస్తున్న పట్టించుకోని అధికారులు

కలుషిత నీరు వస్తున్న పట్టించుకోని అధికారులు

హైదరాబాద్, వెలుగు: వాటర్​బోర్డు సరఫరా చేస్తున్న మంచినీరు చాలాచోట్ల కలుషితమై వస్తోంది. నల్లాల్లో వస్తున్న నీటిలో మురుగు కలుస్తోందని జనం రోజూ ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలోని అధికారులు పట్టించుకోకపోవడంతో కలుషిత నీటి సమస్య తీరడం లేదు. కనీసం ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టడం లేదు. చర్లపల్లి, ఉప్పల్, శాలిబండ, గౌలిపురా శ్రీరాంనగర్, మూసాపేటలోని జనతానగర్, భరత్ నగర్, జీయాగూడ, బోరబండ, మౌలాలి తదితర ప్రాంతాల నుంచి వాటర్​బోర్డుకు అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులు రాని ప్రాంతాలు 100కు పైనే ఉంటాయి. కలుషిత నీటి సమస్యపై రెండు రోజుల కిందట గోషామహల్ కార్పొరేటర్ లాల్​సింగ్ వాటర్​బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. వర్షా కాలంలో తాగునీరు కలుషితమైతే జనం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా సిటీలోని అనేక ప్రాంతాల్లో సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో కాలంతో సంబంధం లేకుండా మురుగు కలిసి వస్తోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కొనుక్కొని తాగాల్సిందే

ఓ వైపు వానా కాలంలో తాగునీటి విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ సరఫరా అయ్యే నీళ్లు కలుషితం అవుతుంటే జనం ఆరోగ్యంగా ఎలా ఉంటారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బయట కొనుక్కొని తాగుతున్నారు. కొన్ని కాలనీల్లో కొన్నాళ్లు మంచిగా సప్లయ్ జరుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు మురుగు మిక్స్​అవుతోందని జనం నల్లా నీళ్లు తాగేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల మాదాపూర్ లోని గుట్టల బేగంపేట, లంగర్ హౌస్​లోని పలు ప్రాంతాల్లో కలుషిత నీరు తాగి చాలా మంది ఆస్పత్రుల పాలయ్యారు.

ఆదేశాలతోనే సరి.. ఆచరణ లేదు

నీటి సరఫరాపై ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీటి సరఫరా తీరుపై కిందిస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించకపోవడంతోనూ సమస్య తీవ్రమైందని తెలుస్తోంది. ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు వస్తే ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో కూర్చోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనివల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇటీవల లంగర్ హౌస్ లో 2 నెలల పాటు పనులు జరగడానికి ఇది కూడా ఓ కారణమే. చివరకు డైరెక్టర్ వెళ్లేంత వరకు పనులు కొలిక్కి రాలేదు. ఉన్నాధికారులు కిందిస్థాయిలో ఏం జరుగుతుందోనన్న దానిపై నిఘా పెడితే జనానికి ఇబ్బందులు ఉండవు.