
- ఇప్పటికే 1,4 97 ఎకరాల్లో సాగుకు ముందుకొచ్చిన రైతులు
- మూడేండ్లుగా సాగు లక్ష్యం 35 శాతం మించలే..
- ఈసారి టార్గెట్ రీచయ్యేలా చర్యలు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది సాగు టార్గెట్ 7,500 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 1,497 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు. మూడేండ్లలో ఉమ్మడి జిల్లాలో 7,335 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేసినా టార్గెట్ 35 శాతం మించలేదు. ఈసారి టార్గెట్ చేరుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సబ్సిడీపై మొక్కలతో పాటు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, నిర్వహణ కోసం నాలుగేండ్లపాటు ఆర్థిక సాయం ఇస్తామని రైతులను ప్రొత్సహిస్తోంది. నాలుగేండ్లకు పంట దిగుబడి రానుండగా, మొక్కలు నాటిన దగ్గరి నుంచి అంతర్ పంటలను సాగు చేసుకోవచ్చు. సబ్సిడీపై రూ.20కి మొక్క, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీపై డ్రిప్ యూనిట్ ఇస్తున్నారు. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి, పత్తి, మక్క, సోయా వంటి పంటలు సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 7,335 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలు సాగు చేశారు. ఇందులో ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో 500 ఎకరాల పంట కోతకు వచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 5,609 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1,726 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో హిందూస్తాన్యూనిలీవర్ కంపెనీ ముందుకు రాగా, ఆయిల్ పామ్ సాగు రైతులకు కొంత ఊరటనిచ్చింది.
ఈ ఏడాది టార్గెట్..
2025-, 26 ఆర్థిక ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు టార్గెట్ 7,500 ఎకరాలు. నిజామాబాద్ జిల్లాలో 5వేల ఎకరాలు, కామారెడ్డిలో 2,500 ఎకరాలు లక్ష్యంగా ఉంది. ఇప్పటికే నిజామాబాద్‌లో 979 ఎకరాలు, కామారెడ్డిలో 518 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు. కామారెడ్డి జిల్లాలో ప్రతి ఏడాది 1,760 ఎకరాలు సాగు లక్ష్యం ఉన్నప్పటికీ మూడేండ్లుగా 35 శాతానికి మించలేదు. ఈసారి టార్గెట్ చేరుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు సూచించారు.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటికే 518 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు అంగీకరించారు. ఇంకా 1,200 ఎకరాలు సాగు చేసేలా రైతులను చైతన్యపరుస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు, దిగుబడి ద్వారా వచ్చే ఆదాయాన్ని వివరిస్తున్నాం.
జ్యోతి, హార్టికల్చర్ జిల్లా అధికారి కామారెడ్డి