లైంగిక వేధింపుల కేసులో .. సీఐడీ ముందుకు యడియూరప్ప

లైంగిక వేధింపుల కేసులో .. సీఐడీ ముందుకు యడియూరప్ప
  • కర్నాటక మాజీ సీఎంను 3 గంటలు విచారించిన అధికారులు

బెంగళూరు: చిన్నారిపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ సీనియర్‌‌ నేత, కర్నాటక మాజీ సీఎం యడియూరప్పను సోమవారం క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) విచారించింది. మూడు గంటల పాటు ఆయనను అధికారులు విచారించారు. తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన కర్నాటక హైకోర్టులో సవాల్‌ చేయడంతో.. యెడియూరప్పను అరెస్ట్‌ చేయొద్దంటూ సీఐడీని కోర్టు ఆదేశించింది. కాగా, గత ఫిబ్రవరిలో తన నివాసంలో జరిగిన సమావేశంలో 17 ఏండ్ల తమ కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. 

దీంతో పోలీసులు ఆయనపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఆ మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌‌తో మరణించగా, యెడియూరప్పను అరెస్ట్‌ చేయాలంటూ ఆమె కుమారుడు కోర్టును ఆశ్రయించాడు. బుధవారం విచారణకు యడియూరప్ప రాకపోవడంతో ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు. అయితే, తాను రాజకీయ పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చానని, సోమవారం సీఐడీ అధికారుల ముందు హాజరవుతానని ఆయన చెప్పారు. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ప్రభుత్వం ఎలాంటి ప్రతీకార రాజకీయాలకు దిగలేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.