టీఆర్ఎస్​ లీడర్ల భూములు కాపాడుకోవడానికే..

టీఆర్ఎస్​ లీడర్ల భూములు కాపాడుకోవడానికే..

మహదేవపూర్, వెలుగు: ‘ముందుగాల అడవిని ఆనుకుని చేసిన సర్వేను కాదని కొత్తగా మళ్లా సర్వే ఎందుకు చేస్తున్నారు సారూ.. అటువైపు టీఆర్ఎస్ నాయకుల భూములు ఉన్నాయనేనా? పెద్దోళ్ల భూములు కాపాడడానికి దళితుల భూములు పోయినా పర్లేదా’ అంటూ రైతులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఎన్ హెచ్ 353 సీ బైపాస్ పనుల సర్వేను గురువారం దళిత రైతులు అడ్డుకున్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపం నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జ్ వరకు రూ. 163 కోట్లతో 17.5 కిలోమీటర్ల నేషనల్ హైవే బైపాస్ కోసం ఆఫీసర్లు సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం సబ్ స్టేషన్ పక్కన నుంచి అంతర్రాష్ట్ర బ్రిడ్జ్  సమీపం వరకు 2.5 కి.మీ. మేర నేషనల్ హైవే అధికారులు సర్వే చేస్తుండగా దళితులు అడ్డుకున్నారు. మా భూములలో హైవే నిర్మించవద్దంటూ పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దళితుల ఆందోళనతో ఆఫీసర్లు వెనుదిరిగారు.

అనంతరం దళిత రైతులు మాట్లాడుతూ తమకు ఒక్కొక్కరికి 10 నుంచి 15 గుంటల భూమి మాత్రమే ఉందని చెప్పారు. అందులో పండిన పంటతోనే ఏడాదంతా కలోగంజో తాగుతూ బతుకుతున్నామన్నారు. ఉన్న కొద్ది భూమినీ లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు చేసిన సర్వేను కాదని మళ్లీ కొత్తగా సర్వే చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూమిని కాపాడుకుంటామని అన్నారు. దళితుల భూమి పోకుండా చూసి రోడ్డునిర్మించాలని ఆఫీసర్లను కోరారు.