కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో హరితహారం టెండర్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎండాకాలంలో మొక్కలకు నీళ్లు పోసి కాపాడేందుకు టెండర్లు పిలువాల్సింది..అంతా అయిపోయాక టెండర్లను ఓపెన్ చేశారు. వానాకాలంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు టెండర్లు ఓపెన్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎండాకాలంలో మొక్కలు ఎండుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వానాకాలం మొదలవుతున్న తరుణంలో టెండర్లను ఓపెన్ చేసి హడావుడి చేస్తున్నారు. సుమారుగా. రూ. కోటి విలువైన టెండర్లలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని స్థానికంగా చర్చసాగుతోంది. గతంలోనూ హరితహారం కింద మీడియన్లలో మొక్కలకు నీళ్లు పోస్తామని చెప్పి అవేమి చేయకుండానే బిల్లులు ఎత్తిన సందర్భాలున్నాయి. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అని పలువురు అనుమానాలు వస్తున్నాయి.
వానలు పడే టైమ్ లో..
కరీంనగర్ స్మార్ట్ సిటీలో 14.5 కిలోమీటర్ల పొడవునా ఆర్ అండ్ బీ రోడ్లు ఉన్నాయి. వీటి నడుమ మీడియన్లలో ఉన్న మొక్కలకు అన్ని కాలాల్లో సంరక్షణ చేయడానికి .. చెట్ల మధ్యలో వచ్చే కలుపు మొక్కలను పీకేయడానికి.. వాటికి కావాల్సిన ఎరువులు వంటివి చల్లడానికి టెండర్లు పిలుస్తారు. సుమారుగా రూ. 62 లక్షలతో టెండర్లు పిలిచి రెండు నెలలు కావొస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోయాయి. అప్పటికే టెండర్ నిర్వహించాల్సి ఉన్నా.. అధికారులు లేట్ చేశారు. దీంతో నగరపాలక సంస్థ కు చెందిన ట్యాంకర్లతోనే నీటిని మొక్కలకు అరకొరగా సరఫరా చేశారు. కాంట్రాక్టర్ కు అప్పగిస్తే నూటికి నూరు శాతం రెగ్యులర్ వాటరింగ్ చేయడం.. కలుపు మొక్కలు తీసేయడం.. ఎరువులు వేయడం చేయాల్సి ఉంటుంది. కానీ ఎండాకాలంలో అవేమీ చేయలేదు. మొక్కలకు మరో వైపు రూ. 30 లక్షలతో మహాత్మా జ్యోతి బాపులే పార్క్ లో నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. ఇవి వచ్చి కూడా రెండు నెలలు అవుతుంది. వీటిని కూడా రెండు రోజుల కిందట హడావుడిగా ఓపెన్ చేసినట్లు తెలిసింది.
రెండింటికి రెండే...
మీడియన్లలో మొక్కల నిర్వహణ, పూలే పార్కు నిర్వహణ కోసం ఆన్ లైన్ టెండర్లు పిలిచారు. వీటికి ఒక్కో దానికి ఇద్దరే టెండర్లు వేశారు. వేసిన ఇద్దరిలోనూ ఒకరిని రిజెక్ట్ చేయించడానికి నానా తంటాలు పడ్డారు. ఓ దశలో మొత్తం కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలారు. ఇద్దరు కాంట్రాక్టర్లకు కొంత మంది సపోర్టు చేశారు. సాధారణంగా టెండర్లు గడువు ముగిసిన తరవాత వారం రోజుల్లోగా వాటిని తెరవాల్సి ఉంటుంది. కానీ కావాలనే అధికారులు.. కొంత మంది ప్రజా ప్రతినిధుల ఒత్తిడి చేయడం వల్ల ఆలస్యం అయిందని తెలుస్తోంది. మీడియన్ల టెండర్లు అయినా ఓపెన్ చేశారు. ఇది తీసిన తెల్లారే హడావుడిగాపూలే పార్క్ కు సంబంధించిన టెండర్లు కూడా తీశారు. ఈ రెండింటిని కావాలనే పెండింగ్ లో పెట్టారా అనే అనుమానాలు వస్తున్నయి. పార్క్ లో ఎటువంటి నిర్వాహణ సరిగా లేకపోవడంతో కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోవడం.. మిగిలినవి కూడా కళావిహీనంగా మారుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి వీలైనంత త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఆన్ లైన్ టెండర్లు అయినా.. అధికార పార్టికి చెందిన నాయకుల దగ్గరి వారికి రావడంతో ఇందులో ఏదో జరుగుతుందని బయట ప్రచారం జరుగుతోంది. ఇంజినీరింగ్ సెక్షన్ లో ఈ టెండర్ల విషయంలో ఏమైనా డబ్బులు చేతులు మారాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
