
- కామారెడ్డి జిల్లాలో 3 నెలల్లో 57,289 మంది లబ్ధిదారులకు అవకాశం
- జూన్ నెల రేషన్తో 3 నెలల బియ్యం పంపిణీ
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రేషన్ కార్డుల సభ్యుల సంఖ్య పెరిగింది. ఇది వరకు పేర్లు లేని వారిని చేర్చటంతో పాటు, కొత్త కార్డులు జారీ చేశారు. ఏప్రిల్ నుంచి జూన్వరకు కొత్తగా 57,289 మంది లబ్ధిదారులను చేర్చగా, 3,077 కొత్త కార్డులు పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో కార్డుల సంఖ్య 2,56,732 కు చేరగా, ఇందులో సభ్యులు 9,35,007 మంది ఉన్నారు. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా మే నెల కంటే జూన్ బియ్యం కోటా 116 మెట్రిక్ టన్నులు అదనంగా రిలీజ్ అయ్యింది. దీంతో జూన్ నెలను కలిపి మూడు నెలల రేషన్ పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది.
కొత్త రేషన్ కార్డులు, పేర్లు చేర్చటం, మార్పులు, చేర్పులకు అవకాశం వంటి వేలాది అప్లికేషన్లు కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డులు, ఉన్న కార్డుల్లో పేర్లను చేరుస్తోంది. ఇది వరకు మీ సేవలో అప్లయ్ చేసుకున్న అప్లికేషన్లతో పాటు, ప్రజా పాలన గ్రామ సభల్లో స్వీకరించిన అప్లికేషన్లపై పరిశీలన చేపట్టి అర్హులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి పెండింగ్లో ఉన్న వాటితో పాటు, కొత్త అప్లికేషన్లనూ క్లియర్ చేశారు.
కార్డులు, మెంబర్ల పెరుగుదల ఇలా..
ఏప్రిల్ నుంచి మే నెల కోటాకు వచ్చే సరికి కొత్తగా 37,409 మంది పెరిగారు. మే నెల నుంచి జూన్ నెల కోటా రిలీజ్ వచ్చే సరికి మరో 19,880 మంది పెరగనున్నారు. ఇటీవల మొత్తం 57,289 మంది లబ్ధిదారులు పెరిగారు.
బియ్యం కోటా రిలీజ్..
జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం కోటాను అధికారులు ఇటీవల రిలీజ్ చేశారు. సివిల్ సప్లయ్ అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ నెలాఖరుకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు సన్న బియ్యం చేరనుంది. జూన్ 1 నుంచి కొత్త, పాత వారందరికీ రేషన్ పంపిణీ చేయనుండగా, ప్రస్తుతం ఉన్న లబ్ధిదారుల సంఖ్యతో జిల్లాలో ప్రతి నెలా 5,903 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు కలిపి మొత్తం 17,711 మెట్రిక్ టన్నుల బియ్యం విడుదల చేశారు.
3 నెలల రేషన్ పంపిణీ
జూన్ నెలతో కలిపి 3 నెలల రేషన్ కోటా ఇచ్చేందుకు ఆర్డర్ ఇచ్చాం. ఈ నెలాఖరుకు అన్ని షాపులకు బియ్యం చేరుతాయి. సరిపడా సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయి.
మల్లికార్జునబాబు, డీఎస్వో, కామారెడ్డి
పెరిగిన లబ్ధిదారుల వివరాలు..
నెల కార్డుల సంఖ్య మెంబర్ల సంఖ్య
ఏప్రిల్ 2,53,655 8,77,718
మే 2,54,552 9,15, 127
జూన్ 2,56,732 9,35,007