
- కొరత ప్రచారం ముందస్తుగా కొనుగోలు చేస్తున్న రైతులు
- సరిపడా స్టాక్ ఉన్నా ఉదయం నుంచే లైన్లు
- జిల్లాల్లో ఎక్కడా కొరత లేదని చెబుతున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. జూన్ లో మురిపించినా జులైలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు సాగు పనులు ముమ్మరం చేశారు. ఈ మేరకు వరి, పత్తి, మొక్కజొన్న వేస్తున్న అన్నదాతలు యూరియా కోసం ఉరుకులాడుతున్నారు. వర్షాలు పడుతుండటం, కొరత ఉందనే ప్రచారం జరుగుతుండటంతో యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద చెప్పులు, రాళ్లు ఇలా ఏదుంటే అది లైన్లలో పెడుతున్నారు.
తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, ఎల్కతుర్తి తదితర ప్రాంతాల్లో ఇలాగే బారులు తీరగా లైన్లలో వేచి ఉన్న రైతులందరికీ యూరియాను అందజేశారు. కాగా, జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అన్నదాతలు ఆందోళన చెందొద్దని స్పష్టం చేస్తున్నారు.
సరిపడా యూరియా నిల్వలు..
ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్ లో దాదాపు 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 7.4 లక్షల ఎకరాల వరకు వరి, 5 లక్షల ఎకరాల వరకు పత్తి, సుమారు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న, 50 వేల ఎకరాలకుపైగా పప్పుదినుసులు, నూనెగింజలు, ఇతర పంటలు వేస్తారని అంచనా వేశారు. ఈ మేరకు సీజన్ మొత్తంలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా అవసరం అవుతుందని లెక్క తేల్చారు. ఇందులో జులైలో ఉండే డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సరఫరా చేసింది.
ఆ తర్వాత ఆగస్టులో డిమాండ్ పెరగనుండగా అవసరం మేరకు యూరియా సప్లై చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉండగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందనే ప్రచారంతో రైతులు సొసైటీలకు క్యూ కడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ఎరువుల వివరాలను ఈపాస్ మెషీన్లలో అప్ డేట్ చేస్తున్నామని, డిమాండ్ మేరకు సప్లై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు.
కొరత ప్రచారంతో ఆందోళన..
కేంద్రం రాష్ట్రానికి ఈ సీజన్ లో 6 లక్షల టన్నులకుగానూ దాదాపు 2.25 లక్షల టన్నుల కోత విధించడంతో యూరియా కొరత ఏర్పడిందనే ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా ఒక రైతుకు నెలలో ఒకసారి మాత్రమే ఎరువులు ఇస్తారని, ఒక్కో సెంటర్ లో రోజుకు 5 టన్నుల కంటే ఎక్కువ ఎరువులు అమ్మొద్దని ఆఫీసర్లకు ఆదేశాలు అందినట్లు ప్రచారం కూడా ఉంది. దీంతో జిల్లాల్లో అంతటా వరినాట్లు ముమ్మరమై, పత్తి, మొక్కజొన్న గింజలు పెడితే యూరియా దొరకదేమోననే రైతులు ఆందోళన చెందుతున్నారు.
యూరియా కోసం ముందస్తుగా పరుగులు పెడుతున్నారు. రోజూ పొద్దున్నే సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద క్యూ కట్టడంతోపాటు చెప్పులు, రాళ్లను లైన్లలో పెడుతున్నారు. దీంతో యూరియాకు ఇప్పుడే కరువొచ్చిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ, ఇప్పటికీ జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
యూరియా కొరత లేదు..
జిల్లాలో యూరియా కొరత లేదు. చాలా వరకు రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి స్టోర్ చేస్తున్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందొద్దు. కృత్రిమ కొరత సృష్టించినా, అన్నదాతలను భయాందోళనలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం.
రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయాధికారి, హనుమకొండ
దొరుకుద్దో లేదోనని తొందరపడుతున్నరు
నేను రెండెకరాల్లో పత్తి వేసిన. వర్షాలు పడుతున్నాయని యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుకు వెళ్తే అక్కడ డీఏపీ, 20–20 ఉన్నయ్ కానీ యూరియా లేదు. ఈసారి యూరియా తక్కువ ఇస్తరని, అది కూడా నెలకు ఒకసారే ఇస్తరని అంటున్నారు. అందుకే ముందుముందు యూరియా దొర్కుతదో లేదో అని రైతులంతా తొందరపడుతున్నరు. రైతుల డిమాండ్ మేరకు యూరియా ఇచ్చేందుకు ఆఫీసర్లు తగిన చొరవ తీసుకోవాలి.
బలేరావ్ సోమాజీ, రైతు, చింతలపల్లి
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా వివరాలు
జిల్లా అందుబాటులో ఉన్న స్టాక్(మెట్రిక్ టన్నుల్లో)
హనుమకొండ 5,049
వరంగల్ 1,800
జనగామ 9,430
జయశంకర్ భూపాలపల్లి 4,429
ములుగు 2442.52
మహబూబాబాద్ 5180