ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత

ఈడీ విచారణలో ఎల్.రమణకు అస్వస్థత

క్యాసినో కేసులో ప్రశ్నిస్తుండగా కండ్లు తిరిగినయ్​ 

హైదరాబాద్, వెలుగు: చీకోటి ప్రవీణ్‌‌‌‌ క్యాసినో కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎల్‌‌‌‌. రమణ అస్వస్థతకు గురయ్యారు. ఈడీ అధికారులు ప్రశ్నించడం ప్రారంభించిన అరగంటకు ఆయన అస్వస్థతకు గురికావడంతో అధికారులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌‌‌‌ కు తరలించారు. కొన్నాళ్లుగా క్యాసినో కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు మనీలాండరింగ్, హవాలా కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్‌‌‌‌.రమణకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించారు. శుక్రవారం ఉదయం11 గంటలకు బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఈడీ ఆఫీస్‌‌‌‌లో స్పెషల్ టీం ముందు ఎల్‌‌‌‌. రమణ హాజరయ్యారు. ఈడీ అధికారులు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా ప్రశ్నించడం ప్రారంభించారు. విచారణలో అరగంట గడిచే సరికి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.  

అబ్జర్వేషన్ లో ఉంచాలన్న డాక్టర్లు   

ఈడీ అధికారులు విచారించే సమయంలో కండ్లు తిరుగుతున్నాయని, కూర్చోలేని స్థితిలో ఉన్నానని ఎల్.రమణ చెప్పారు. ముందుగా సెక్యూరిటీ హైదర్‌‌‌‌‌‌‌‌గూడలోని అపోలో హాస్పిటల్‌‌‌‌కి తరలించారు. గతంలో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌‌‌‌లో హార్ట్‌‌‌‌ సర్జరీ జరిగినట్లు తెలుసుకొని యశోదకు తరలించారు. అక్కడ గతంలో అమర్చిన స్టంట్‌‌‌‌ను పరిశీలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఈడీ అధికారులకు వివరించారు. అబ్జర్వేషన్‌‌‌‌లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు విచారణను వాయిదా వేశారు. ఎల్.రమణకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు.