జేసీబీలతో రిపేర్లు ఫైరింజన్లతో క్లీనింగ్‌.. బురద తొలగింపులో ఫైర్‌, రోడ్ల రిపేర్లలో కార్పొరేషన్‌ ఆఫీసర్లు బిజీ

జేసీబీలతో రిపేర్లు ఫైరింజన్లతో క్లీనింగ్‌.. బురద తొలగింపులో ఫైర్‌, రోడ్ల రిపేర్లలో కార్పొరేషన్‌ ఆఫీసర్లు బిజీ
  • సీఎం ఆదేశాలతో రంగంలోకి అధికారులు
  • చెరువు కట్టలకు సైతం మరమ్మతులు చేపట్టిన సిబ్బంది

వరంగల్‍, వెలుగు : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫీసర్లు, సిబ్బంది కాలనీల బాట పట్టారు. మొంథా తుఫాన్‌ వరద ప్రభావం తగ్గిన వెంటనే శానిటేషన్‌ పనులను చేపట్టాలని సీఎం రేవంత్‍రెడ్డి ఆదేశించిన 24 గంటల్లోనే సిబ్బంది రంగంలోకి దిగారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, బురదను తొలగించడంతో పాటు, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. అలాగే తెగిన చెరువు, కుంట కట్టలకు రిపేర్లు చేపట్టారు. 

వరద కారణంగా నష్టపోయిన వారికి సాయం అందించడంతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజీల పనులకు అంచనాలు తయారుచేసే పనుల్లో నిమగ్నమయ్యారు. హనుమకొండ కలెక్టర్‍ స్నేహ శబరీష్‍, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ చాహత్‍ బాజ్‍పాయ్‍ స్వయంగా కాలనీల్లో తిరుగుతూ శానిటేషన్‌ పనులను పర్యవేక్షించారు.

30 మంది ఫైర్‌ సిబ్బంది.. ఆరు ఫైరింజన్లతో..

హనుమకొండ నగరంలో ప్రధానంగా ఏన చెరువు పొంగిన నేపథ్యంలో నీటమునిగిన కాలనీలను ఆఫీసర్లు ఫైరింజన్ల సాయంతో క్లీన్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు.  ఇందులో భాగంగా శనివారం ఉదయమే సుమారు 30 మంది ఫైర్‌ సిబ్బంది ఆరు ఫైరింజన్లతో కేయూ 100 ఫీట్ల రోడ్డులోని సమ్మయ్యనగర్‍, వాజ్‍పాయ్‌నగర్‌, టీవీ టవర్‌ కాలనీ, వివేక్‌నగర్‌, అమరావతి నగర్‍, జవహర్‌ కాలనీ, ప్రగతి నగర్‌ కాలనీల్లో సుమారు ఫీటు ఎత్తులో పేరుకుపోయిన బురదను స్పీడ్‍ ప్రెజర్‌ నీటితో క్లీన్‌ చేశారు. 

హనుమకొండ – కాజీపేట నగరాలకు వారధిగా నిలిచే కేయూ 100 ఫీట్ల మెయిన్‌ రోడ్డు చాలా చోట్ల కొట్టుకుపోయిన నేపథ్యంలో జేసీబీలతో రిపేర్లు మొదలుపెట్టారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న పెద్దరాళ్లు, చెత్తను తొలగించడమే కాకుండా వెంట వెంటనే గుంతలను పూడ్చివేశారు.

ఊర చెరువు కట్టకు రిపేర్లు

మొంథా తుఫాన్‌ ప్రభావంతో హనుమకొండలో ఈ సారి పెద్ద ఎత్తున వరద వచ్చినప్పటికీ బుధవారం రాత్రి వర్షం తగ్గగానే.. కొన్ని గంటల్లో వరద మొత్తం డ్రైనేజీల మీదుగా నయీంనగర్‍ నాలాలో కలిసి సాఫీగా బయటకు వెళ్లింది. అయితే ఎగువ ప్రాంతంలోని రాంపూర్‍, మడికొండ, సొమిడి, వడ్డేపల్లి చెరువుల మీదుగా వచ్చిన వరద కారణంగా హనుమకొండ సిటీలోని గోపాల్‍పూర్‍లోని ఊర చెరువు పొంగడంతోనే చుట్టూరా ఉండే పదుల సంఖ్యలో కాలనీలు నీటమునిగడంతో స్థానికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గురువారం ఇరిగేషన్‌, ఇతర శాఖల అధికారులు ఊర చెరువు దెబ్బతిన్న ప్రాంతాల్లో రిపేర్లు చేపట్టారు.

ఓరుగల్లుకు మరోసారి ఎన్‌డీఆర్‌ఎఫ్‌..

మొంథా తుఫాన్‌ వరంగల్‍ నగరంపై ప్రభావం చూపనుందన్న ముందస్తు సమాచారంతో గ్రేటర్‍ బల్దియా పరిధిలోని డీఆర్‍ఎఫ్‍ బృందాలు సమాయత్తం అయ్యాయి. బుధవారం దంచికొట్టిన వానకు హనుమకొండ, వరంగల్‍ ప్రాంతాలు అతలాకుతలమైన క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ వరదల్లో చిక్కుకున్న జనాలను కాపాడేందుకు బోట్లు, ఇతర వాహనాల ద్వారా శ్రమించారు. దాదాపు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా, గురువారం ఉదయం నుంచి సిటీలో తుఫాన్‍, వానలు లేనప్పటికీ.. మరోసారి వరద సహాయక చర్యల్లోనూ పనిచేస్తూ స్థానిక సిబ్బందికి చేదోడుగా నిలుస్తున్నారు. కాలనీల్లో చెత్తచెదారాన్ని సకాలంలో శుభ్రపరచకుంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్న హెచ్చరికలతో శనివారం పలు కాలనీల్లోని సర్కారు స్కూళ్లు, అంగన్‍వాడీ సెంటర్లు, హాస్పిటళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించే పనుల్లో డీఆర్‍ఎఫ్‍ బృందాలు నిమగ్నమయ్యాయి.