
హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాలను జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ చేశారు. హైదరాబాద్ సిటీలో సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారిపోయింది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గురువారం రాత్రి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ఒక గేటును అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు పంపాలని అధికారులు డిసైడ్ అయ్యారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడం గమనార్హం.
భారీ వర్షాలతో హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడం, ట్రాఫిక్‌కు అంతరాయం, విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040-2302813 / 74166 87878. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేసి రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలని.. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని కలెక్టర్ హరి చందన ఆదేశించారు.