
న్యూఢిల్లీ: ఢొల్ల కంపెనీలను ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగించేందుకు కంపెనీల చట్టంలోని మూడో అమెండ్‌మెంట్‌ను కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ సవరించింది. ఇందులో భాగంగా కంపెనీలు రిజిస్ట్రేషన్ టైమ్‌లో పేర్కొన్న రిజిస్టర్డ్ ఆఫీస్‌ను అధికారులు వెళ్లి చెక్ చేస్తారు. ఈ రూల్ ఈ నెల 18 నుంచి అమల్లోకి వస్తుంది. రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) అధికారులు లోకల్‌గా ఉన్న ఇద్దరి ఇండిపెండెంట్ వ్యక్తుల సమక్షంలో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. అవసరమనుకుంటే లోకల్ పోలీసులు సహాయాన్ని కూడా పొందుతారు. ఈ రూల్ వలన కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ పోర్టల్‌లో నమోదైన కంపెనీల వివరాలను మరోసారి చెక్ చేసుకోవడానికి ప్రభుత్వానికి వీలుంటుంది.
ఆర్‌ఓసీ అధికారులు కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసులను ఎలా వెరిఫై చేశారో పూర్తి వివరాలను కూడా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీలకు ఆర్‌ఓసీ అధికారుల నుంచి ఆమోదం తెలిపిన నోటిసులు లేదా ఇతర నోటిసులు రాకపోతే సంబంధిత కంపెనీ 30 రోజుల్లో రెస్పాండ్ కావొచ్చు. అప్పటికి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఈ సంబంధిత కంపెనీని రిజిస్టర్ అయిన కంపెనీల డేటాబేస్ నుంచి తొలగిస్తారు. ఇలా చేయడం ద్వారా ఢొల్ల కంపెనీలను గుర్తించినట్టు అవుతుంది. అలానే మనిలాండరింగ్ ఆపడానికి, నల్లధనాన్ని గుర్తించడానికి వీలుంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా రిజిస్టర్ ఆఫ్ కంపెనీల డేటా బేస్‌ను మేనేజ్ చేయడం కూడా ఈజీగా మారుతుందని వివరించింది.