ఇరాన్‌‌‌‌–అమెరికా యుద్ధం.. పడనున్న మార్కెట్‌‌‌‌ ? భారీగా పెరగనున్న క్రూడాయిల్ ధరలు

ఇరాన్‌‌‌‌–అమెరికా యుద్ధం.. పడనున్న మార్కెట్‌‌‌‌ ? భారీగా పెరగనున్న క్రూడాయిల్ ధరలు

న్యూఢిల్లీ: మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో ఉద్రిక్తతలు ముదరడంతో సోమవారం మార్కెట్ నష్టాల్లో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమెనీ మరణించడంతో  పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. గ్లోబల్ క్రూడాయిల్ రవాణాలో 20 శాతం హోర్మూజ్ జలసంధి ద్వారా జరుగుతోంది.

మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో ఉద్రిక్తతలు తీవ్రమయితే ఆయిల్ రవాణాకు అంతరాయం ఏర్పడొచ్చు. అప్పుడు క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. భారతదేశం చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్నందున, క్రూడ్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు (ఖర్చులు మైనస్ ఆదాయం) ఎక్కువవుతుంది.  వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలపై ఒత్తిడి పెరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర శుక్రవారం 2.87శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌కు 72.87 డాలర్లకు  చేరింది.

చమురు ధరలు ఎక్కువ కాలం హై లెవెల్స్‌‌‌‌లో ఉంటే ఇండియా వాణిజ్య లోటు పెరుగుతుందని  జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌మార్ట్ ఎనలిస్ట్  సంతోష్ మీనా ప్రకారం, మార్కెట్లు సోమవారం నెగెటివ్‌‌‌‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) జీడీపీ డేటా, ఆటో అమ్మకాల గణాంకాలు, పీఎంఐ, ఐఐపీ వంటి దేశీయ సూచీలు పెట్టుబడిదారుల అంచనాలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

గ్లోబల్ స్థాయిలో అమెరికా, చైనా ఆర్థిక డేటా, క్రూడ్ ధరల మార్పులు, విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల కదలికలు ఈ వారం  మార్కెట్ దిశను నిర్ణయిస్తాయని అన్నారు. గత వారం సెన్సెక్స్ 1,527 పాయింట్లు, నిఫ్టీ 392 పాయింట్లు పడ్డాయి. హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు.