- అవగాహన ప్రోగ్రామ్స్ నిర్వహణలో యంత్రాంగం వైఫల్యం
- టార్గెట్ 35 వేల ఎకరాలు కాగా, ఐదేండ్లలో 6,500 ఎకరాలకే పరిమితం
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు అనుకున్న లక్ష్యానికి దూరంగా ఉంది. లాభాలు వచ్చే పంట అయినప్పటికీ రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు సంబంధిత యంత్రాంగం రైతులకు అవగాహన కల్పించడంలో వైపల్యం చెందారని వ్యవసాయ నిపుణులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతుండగా, ప్రకృతి వైఫరీత్యాల వల్ల నష్టపోతున్నా రైతులు ప్రత్యామ్నాయ సాగుపై ఆసక్తి చూపడం లేదు. లాభదాయకమైన పంటల సాగును ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆలోచనకు పూర్తిస్థాయిలో సహకారం అందడంలేదు. 2021లో జిల్లాలో 35 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం 6,500 ఎకరాలకే పరిమితమైంది.
జిల్లాలో పంటల సాగు..
జిల్లాలో రిజర్వాయర్‌లు ఉండడంతో సాగునీటికి కొదవ లేదు. ప్రభుత్వం సరిపడా విద్యుత్ సరఫరా చేస్తోంది. గడిచిన రెండేండ్లలో 5.15 లక్షల ఎకరాల నుంచి 5.22 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందులో వరి 4.31 లక్షల ఎకరాలు, మక్కజొన్న 25,202 ఎకరాలు, నువ్వులు 8,239 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1,265 ఎకరాలు, పొగాకు 2,065 ఎకరాల్లో సాగవుతున్నాయి. హార్టికల్చర్ పంటలు 35,897 ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇందులో పసుపు 22,941 ఎకరాలు, మామిడి 4,119 ఎకరాలు, జామ తదితర పంటలు 347 ఎకరాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 530 ఎకరాల్లో ఆయిల్
పామ్సాగైంది.
ఆయిల్‌పామ్‌కు సాగుకు భారీ సబ్సిడీ..
ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తోంది. రూ.200 విలువైన మొక్కను రైతులకు రూ.20కే సరఫరా చేస్తోంది. అంతరపంటల సాగుకు ప్రతి ఎకరాకు నాలుగేండ్లపాటు రూ.4,200 చొప్పున సాయం అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.30 వేల వరకు బీసీలకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇస్తోంది. పంట కోతకు వచ్చిన తర్వాత ఆయిల్‌పామ్ కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎకరానికి గరిష్టంగా రూ.లక్షన్నర వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మొక్క నాటిన ఐదేండ్ల నుంచి సుమారు 35 ఏండ్ల పాటు పంట దిగుబడి
వస్తోంది.
ప్రచార లోపం శాపంగా
జిల్లాలో సాగైన ఆయల్‌పామ్ పంట కోతలు ఈ ఏడాది షురువై ఇప్పటికి 500 టన్నుల అమ్మకాలు జరిగాయి. టన్నుకు రూ.20 వేల రేట్‌తో ఎకరానికి ఏడు టన్నులకు మించి వచ్చిన దిగుబడిని రైతులు విక్రయించారు. మరో రెండేండ్ల తరువాత దిగుబడి పది టన్నులు దాటి ఆదాయం రూ.2 లక్షలు టచ్ అవుతుందని హార్టికల్చర్ ఆఫీసర్లు అంటున్నారు. ఈ అంశాలపై రైతుల్లో ప్రచారం కొరవడి సాగు విస్తీర్ణం పెరగడంలేదు.
అవగాహన కల్పిస్తాం
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చు. ఒక్కసారి దిగుబడి ప్రారంభమైతే 35 ఏండ్ల వరకు పంటను కోసుకోవచ్చు. ఆయిల్పామ్సాగు చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మొక్కలు, అంతరపంట, కొనుగోలు సెంటర్ ఏర్పాటు, గిట్టుబాటు ధర తదితర అంశాలను రైతులకు వివరిస్తాం. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్సాగయ్యేలా ప్రయత్నిస్తాం. అందుకు ప్రణాళిక రూపొందించడంతోపాటు అధికారులను సన్నద్ధం చేస్తున్నాం. - శ్రీనివాస్, ఏడీ, హార్టికల్చర్
