సన్​​ఫ్లవర్​ ఆయిల్​ @180

సన్​​ఫ్లవర్​ ఆయిల్​ @180
  • పెరిగిన పల్లినూనె, పామాయిల్​ రేట్లు 
  • మాల్స్​, సూపర్​ మార్కెట్లలో రూ.200  
  • ఏడాదిలో 70శాతం పెరిగిన ఆయిల్​ రేట్లు

మంచిర్యాల, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో వంట నూనెల రేట్లు మండిపోతున్నాయి. ఆయిల్​ రేట్లు వింటేనే సామాన్యులు ఉలిక్కిపడుతున్నారు. సన్​ఫ్లవర్​, గ్రౌండ్​ నట్ ఆయిల్​ లీటర్​కు రూ.180 కాగా, పామాయిల్​, రైస్​బ్రాన్ ఆయిల్​రేట్లు వాటితో పోటీపడుతున్నాయి. సగటున నెలకు రూ.5 నుంచి రూ.10 చొప్పున గతేడాది కాలంలో ఏకంగా 70 శాతం పెరిగాయని వ్యాపారస్తులు చెప్తున్నారు. నిరుడు లాక్​డౌన్​కు ముందు మార్చిలో ఫ్రీడం రిఫైన్డ్​ సన్​ఫ్లవర్​ లీటర్​ ప్యాకెట్​ రిటైల్​లో రూ.105 ఉండగా, లాక్​డౌన్​ టైంలో రూ.120కి పెరిగింది. గ్రౌండ్​నట్​ రూ.110 నుంచి రూ.125కు చేరింది. ట్రాన్స్​పోర్టేషన్​ నిలిచిపోవడం, కంపెనీలు బంద్​ కావడం వల్ల ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. లాక్​డౌన్​ తర్వాత ధరలు తగ్గుతాయని అనుకున్నా ప్రతినెల  పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది దసరా పండగకు రూ.130, ఈ ఏడాది సంక్రాంతికి రూ.150 ఉన్న ఆయిల్​ రేటు ఇప్పుడు రూ.175 నుంచి రూ.180కి చేరింది. గ్రౌండ్​నట్ రేటు సన్​ఫ్లవర్​ కంటే ఎప్పుడూ రూ.20 వరకు ఎక్కువగా ఉండేది. ఇటీవల రెండింటి ధరలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. పామాయిల్​ ధర కూడా ఏడాదిలో రూ.75 నుంచి రూ.135కి, రైస్​బ్రాన్ రేటు రూ.90 నుంచి రూ.145కి పెరిగింది. మాల్స్​, సూపర్​మార్కెట్లలో సన్​ఫ్లవర్​, గ్రౌండ్​నట్​ రూ.190 నుంచి రూ.200లకు లీటర్​ అమ్ముతున్నారు. ఎమ్మార్పీ మాత్రం బ్రాండ్లను బట్టి రూ.200 రూ.220 వరకు ఉన్నాయి. 

కరోనాకు తోడు దిగుమతి సుంకాలు..
మనదేశం వంటనూనెల ముడిసరులను ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా, థాయ్​లాండ్​  నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాలు కరోనా ఎఫెక్ట్​తో ముడిసరుకుల ధరలను పెంచాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచింది. పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచడంతోట్రాన్స్​పోర్ట్​ చార్జీలు పెరిగాయని, దీంతో కంపెనీలు వంటనూనెల రేట్లను పెంచాయని వ్యాపారస్తులు అంటున్నారు. 

చాయ్​ పత్తిపై రూ.100కు పైగా..
రోజూ పొద్దుపొడవగానే ప్రతి ఇంట్లో చాయ్​ తాగడం అలవాటు. రోజుకు మూడు నాలుగుసార్లు టీ తాగేవారూ ఉన్నారు. చాయ్​పత్తి రేట్లు సైతం గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగాయి. నిరుడు లాక్​డౌన్​కు ముందు బ్రాండెడ్​ టీపౌడర్​ రేటు కిలోకు  రూ.300 నుంచి రూ.310 ఉండగా, ఇటీవల రూ. 410 నుంచి రూ.420 వరకు అమ్ముతున్నారు. పప్పులతో పాటు అన్ని రకాల నిత్యావసరాల ధరలు కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. రిటెయిల్​ షాపుల్లో నంబర్​ వన్​ కందిపప్పు రూ.120, పెసరపప్పు 110, మినపపప్పు రూ.130, శనగపప్పు రూ.90, పల్లీలు రూ.120 చొప్పున అమ్ముతున్నారు. నాలుగు నెలల కిందట పప్పుల రేట్లు రూ.10 వరకు పెరిగినప్పటికీ మళ్లీ నెలరోజుల్లో తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది. ఉల్లిగడ్డలు ప్రస్తుతం కిలో రూ.20 ఉండగా, వెల్లుల్లి రూ.100, అల్లం రూ.70, పసుపు రూ.180, కారం రూ.220 నుంచి రూ.250 పలుకుతున్నాయి.