ఒక్కసారి చార్జ్.. 500 కి.మీ జర్నీ

ఒక్కసారి చార్జ్.. 500 కి.మీ జర్నీ

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ‘ఓలా ఎలక్ట్రిక్’ తనదైన ముద్రవేసింది. మంచి సేల్స్ ను సాధించింది. ఇప్పుడు ఇదే విభాగంలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ ఉవ్విళ్లూరుతోంది. ఆగస్టు 15న మూడు సరికొత్త మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆ కార్లలో 2170 లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందని.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించవచ్చని అంటున్నారు. ఈ కార్లపై అంచనాలను పెంచేలా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ ఇటీవల ట్వీట్ చేశారు. అధునాతన ఫీచర్లతో ఈ కార్లు వస్తాయని ఆయన తెలిపారు. కూప్, సెడాన్, ఎస్ యూ వీ అనే మూడు బాడీ మోడళ్లలో ఈ కార్లు వచ్చే అవకాశం ఉందని వాహన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ మూడు మోడళ్లను ఏకకాలంలో విడుదల చేయొద్దనే నిర్ణయానికి ఓలా ఎలక్ట్రిక్ వస్తే.. ప్రస్తుతానికి ఒకే ఒక మోడల్ ఎలక్ట్రిక్ కారు విడుదలతో సరిపెట్టే చాన్స్ ఉంది. అయితే దీని ధర ఎంత ఉంటుందనే దానిపై ఇంకా ఎలాంటి వివరాలూ బయటికి రాలేదు. కాగా, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర ప్రస్తుతం దాదాపు రూ.1.29 లక్షలు ఉంది. 

బ్యాటరీల రిసెర్చ్ పై ఓలా దృష్టి.. 

ఎలక్ట్రిక్ వాహన రంగంలో విజయానికి ప్రాతిపదిక బలమైన, సురక్షితమైన బ్యాటరీలే. ఈనేపథ్యంలో బెంగళూరులో 11 ఎకరాల్లో  బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటుచేస్తున్నామని ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ సెంటర్ వేదికగా ఎలక్ట్రిక్ బ్యాటరీలు, బ్యాటరీ సెల్స్ కు సంబంధించిన పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించనుంది.