బువ్వ కోసం: జపాన్ లో జైలుకెళ్తున్న ముసలోళ్లు

బువ్వ కోసం: జపాన్ లో జైలుకెళ్తున్న ముసలోళ్లు

జపాన్‌ లో ముసలి నేరస్థులు పెరుగుతున్నారు. గత 20 ఏళ్లలో వాళ్ల గ్రాఫ్‌ క్రమక్రమంగా పెరుగుతోంది. 1997లో 20 మంది నేరస్థుల్లో ఒకరు 60 ఏళ్లపైబడిన వారు ఉండేవారు. కానీ ఇప్పుడు ఐదుగురిలో ఒకరు ఉన్నారు.

ఇదీ తొషియో కథ
69 ఏళ్ల తొషియో తకట ఈమధ్యే జైలు నుంచి విడుదలయ్యాడు. ఎందుకు జైలుకెళ్లా వని ఆరా తీస్తే ‘‘పెన్షన్‌ తీసుకునే వయసు వచ్చింది. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. పేదోడిని.. ఎక్కోడోచోట ఫ్రీగా బతికేయాలి. అది జైలైనా పర్వాలేదు. అందుకే నేరం చేశా.. జైలుకెళ్లా’’ అని అన్నాడు. ‘‘62 ఏళ్ల వయసులో తొలిసారి సైకిలు దొంగిలించి పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లా. అదే విషయం వాళ్లకు చెప్పా. ప్లాన్‌ వర్కవుట్‌‌ అయింది. కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది’’ అని చెప్పాడు. ఇలా మొత్తంగా ఎనిమిదేళ్లలో నాలుగేళ్లు అతను జైల్లోనే గడిపాడు. భార్యాపిల్లలుండుంటే ఇలాంటి పనెందుకు చేస్తానని తొషియో అంటున్నాడు.

ముసలోళ్లే ఎక్కువ
చట్టాన్ని గౌరవించే జపాన్‌ దేశంలో ముసలివాళ్లు చేస్తున్న నేరాలు పెరిగిపోవడం ఆలోచించాల్సిన విషయం. 1997 నాటి లెక్కలు, ఇప్పటి లెక్కలు పరిశీలిస్తే చాలా తేడా కనబడుతుంది. అప్పుడు 20 మందిలో ఒకరు 60 ఏళ్లపైబడిన వారుంటే ఇప్పుడు ఐదులో ఒకరున్నారు. 65 ఏళ్ల పైబడిన వాళ్ల సంఖ్య కన్నా వేగంగా వాళ్లు చేస్తున్న నేరాలు పెరిగిపోతున్నాయి. పైగా చేసిన వాళ్లే మళ్లీ మళ్లీ నేరాలు చేసి జైలుకెళ్తున్నారు. 2016లో 2,500 మంది 65 ఏళ్ల పైబడినవారు నేరాలు చేస్తే అందులో మూడోవంతు ఇదివరకే ఐదు నేరాలు చేసినవారున్నారు.

చిన్నచిన్న దొంగతనాలే
ముసలివారు చేసిన నేరాల్లో ఎక్కువ షాపు దొంగతనాలే. రూ.2 వేలు కూడా లేని వస్తువులను దొంగతనం చేసి దొరికిపోయినవారే. ఇలాంటి చిన్న చిన్న కేసులకు కూడా జపాన్‌ కోర్టులు విచారిస్తున్న తీరు విచిత్రంగా ఉందంటున్నారు నిపుణులు. ‘‘రూ.130 సాండ్‌‌విచ్‌‌ దొంగతనానికి రెండేళ్ల జైలు. అంటే రెండేళ్లకు తిండికయ్యే ఖర్చు సుమారు రూ.54 లక్షలు’’ అంటున్నారు. జపాన్‌ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ ఎటూ సరిపోకే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. సాధారణంగా పిల్లలే వాళ్ల తల్లిదండ్రులను చూసుకుంటుంటారు. కానీ ఉద్యోగాల కోసం వాళ్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో ముసలివారు దిక్కులేకుండా అయిపోతున్నారు. పెన్షన్‌ తో బతకలేక దొంగతనాలు చేసి జైలుకెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ మూడు పూటల తిండి ఉంటుంది. ఉండేందుకు స్థలం ఉంటుంది. పైగా దేనికి డబ్బులు కట్టాల్సిన పని లేదు.

త్వరలో రిటైర్మెంట్‌ విలేజ్‌‌
నేరస్థులు పెరుగుతుండటంతో జపాన్‌ ప్రభుత్వం జైళ్ల సామర్థ్యం పెంచుతోంది. మహిళా నేరస్థులు పెరుగుతుండటంతో మహిళా పోలీసులను రిక్రూట్‌‌ చేస్తోంది. మరోవైపు జైళ్లలోని ఖైదీల మెడికల్‌ బిల్లు కూడా పెరుగుతోంది. కోర్టు ప్రొసీడింగ్‌ లు, ఇతరత్రా విచారణ ఖర్చుల కన్నా కూడా వృద్ధులను వసతులు కల్పిస్తే చాలా వరకు ఖర్చు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ‘‘దీనికి పరిష్కారంగా రిటైర్మెంట్‌‌ విలేజ్‌‌ను నిర్మించాలనుకుంటున్నాం. ప్రజలు వాళ్ల పెన్షన్‌ లో సగభాగం చెల్లిస్తే ఇక్కడ ఉండేందుకు స్థలం, ఆహారం, చికిత్స చేస్తాం’’ అని అధికారులు అంటున్నారు.