ఈటల అనుచరులపై పాత కేసులు తిరగతోడుతున్న అధికారులు

ఈటల అనుచరులపై పాత కేసులు తిరగతోడుతున్న అధికారులు

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుచరులపై అధికారులు పాతకేసులు తిరగతోడుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో చైర్మన్ (ప్రస్తుత జడ్పీటీసీ) మాడ వనమాల భర్త సాధవరెడ్డికి కేడీసీసీ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు ఎరువులు, నిధులు దుర్వినియోగం చేయడంతో రూ. 18 లక్షల అవినీతి జరిగిందంటూ కేడీసీసీ బ్యాంకు 2017లో ఆయనకు నోటిసులు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సాధవరెడ్డి అదే సమయంలో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే సాధవరెడ్డికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. కాగా.. మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించడంతో.. సాధవరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అందువల్లే తనకు నోటీసులు మళ్లీ పంపించారని సాధవరెడ్డి అంటున్నారు. అదేవిధంగా ఈటలకు అనుకూలంగా ఉంటున్నాడనే కారణంతో హుజురాబాద్ ఏసీపీగా ఉన్న సుందరగిరి శ్రీనివాస్‌ను కూడా బుధవారం బదిలీ చేసి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిన్న హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ రావు.. నేడు ఈటల అనుచరుల మీద వేటు వేయడంతో.. మరి రేపు ఎవరి మీద వేటు పడుతుందోనని అందరూ చర్చించుకుంటున్నారు.