
- కర్రతో కొట్టి చంపి.. గోల్డ్, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు
- అల్వాల్ పరిధి సూర్యనగర్ లో ఘటన
అల్వాల్, వెలుగు: మేడ్చల్ జిల్లా అల్వాల్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి వేళ దుండగులు కర్రతో కొట్టి చంపి, నగదు, నగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. భద్రాద్రి జిల్లా మానిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య,(70) రాజమ్మ(65) దంపతులు. కొన్నేండ్ల కింద అల్వాల్పరిధిలోని సూర్య నగర్ ఏరియాకు వచ్చి అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వీరి ఇంట్లోకి ప్రవేశించి కర్రతో విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. అనంతరం రాజమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసుతో పాటు వడ్డీకి ఇవ్వడానికి ఇంట్లో దాచుకున్న రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. వృద్ధ దంపతులు హత్యకు గురికావడంతో కూతురు లత, కొడుకు రాము, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
త్వరలోనే నిందితులను పట్టుకుంటాం: బాలానగర్ ఇన్చార్జి డీసీపీ
స్థానికుల సమాచారంతో బాలానగర్ ఇన్చార్జి డీసీపీ సురేశ్ కుమార్, పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు, ఎస్ఓటీ, అల్వాల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించామని.. హత్యకు ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తునట్లు డీసీపీ సురేశ్ కుమార్ తెలిపారు. ఇంట్లో నుంచి నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.