
అంబర్ పేట, వెలుగు: అంబర్ పేటలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధులను హత్య చేసి, దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కాచిగూడ పోలీసుల ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి లింగారెడ్డి (80), ఊర్మిళాదేవి (75) దంపతులు.. బాగ్ అంబర్ పేట్ లోని సాయిబాబా నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో నివసిస్తున్నారు. మరో కూతురు, అల్లుడు హైటెక్ సిటీలో ఉంటున్నారు. సిటీలో ఉంటున్న కూతురు రెండు రోజుల నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆందోళనకు గురైన ఆమె..విషయం భర్తకు చెప్పింది. అతను తన స్నేహితుడు రవీంద్రను సాయిబాబా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న తన అత్తమామ ఇంటికి వెళ్లి మాట్లాడించాలని కోరాడు. వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన రవీంద్ర.. ఇరువురూ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే అంబర్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శాంపిల్స్ సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేయడం కోసమే ఇరువురిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేశామని..దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.