చిన్న కొడుకు మమ్మల్ని చూస్తలేడు!..అతనికి ఇచ్చిన భూమి పట్టా రద్దు చేయండి

చిన్న కొడుకు మమ్మల్ని చూస్తలేడు!..అతనికి ఇచ్చిన భూమి పట్టా రద్దు చేయండి
  • హనుమకొండ ఆర్డీవోకు  వృద్ధ దంపతుల ఫిర్యాదు 

భీమదేవరపల్లి, వెలుగు: చిన్న కొడుకు తమ బాగోగులు చూడడంలేదని, అతని భూమి పట్టా రద్దు చేయాలని వృద్ధ దంపతులు హనుమకొండ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లా  భీమదేవర పల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన మట్టెడ ఆదాం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. ఆదాం తన ఐదెకరాల భూమిని ఇటీవల ఇద్దరు కొడుకులకు రెండెకరాల చొప్పున, కూతురికి ఇరవై గుంటలు పట్టా చేసి ఇచ్చాడు. 

తల్లిదండ్రుల బాగోగులు ఇద్దరు కొడుకులు నెలకొకరు చూసుకోవాలని పెద్ద మనుషులు తీర్మానించారు. నెల రోజులు పెద్ద కొడుకు రవి బాగానే చూసుకుంటున్నాడని, చిన్న కొడుకు దేవేందర్ పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. చిన్న కొడుకు పేరిట పట్టాను రద్దు చేసి, తిరిగి తమ పేరిట పట్టా ఇవ్వాలని బుధవారం హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. చనిపోయే వరకు తమ పేరు మీదనే భూమి పట్టా ఉండాలని ఆర్టీవోకు వినతి పత్రంలో కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాథోడ్ రమేశ్​తెలిపారు.