
భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు :ఆసరా పెన్షన్ కోసం వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు నిత్యం ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఒక నెలలో రావాల్సిన పెన్షన్ డబ్బులు, మరో నెలలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు నెలలుగా పెన్షన్ రాక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో జులై నెల పెన్షన్ నెల దాటుతున్నా డబ్బులు అకౌంట్లలో జమ కాలేదు. కపోవడంతో ఆసరా పెన్షన్లు మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయా అంటూ వృద్ధులు రోజూ పోస్టాఫీస్, బ్యాంకులు, సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. వారి నుంచి సరైన జవాబు రాక నిరాశగా
వెనుతిరుగుతున్నారు.
ఆసరా ఎప్పుడొస్తుందో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్దులు కలిపి దాదాపు రెండున్నర లక్షల మంది ఆసరా పెన్షన్ దారులు ఉన్నారు. ఇందులో దివ్యాంగులు 37వేల మందికి పైగా ఉన్నారు. గతంలో ప్రతి నెల 10వ తేదీ లోపు పెన్షన్ డబ్బులు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేది. కాగా దివ్యాంగులకు నెలకు రూ. 3,016, ఇతరులకు రూ. 2,016ల చొప్పున పెన్షన్ వచ్చేవి. జూన్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు ఖాతాల్లో జమ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ బియ్యం, పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి బతికే వారి పరిస్థితి దారుణంగా మారింది. డబ్బులు రాక మందులను కొనుక్కోలేకపోతున్నామని మరికొందరు వాపోతున్నారు. ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్లలో ఎక్కువ మంది హోటల్ వర్కర్లు, పండ్లు, కూరగాయలు అమ్ముకొనే చిరు వ్యాపారులు ఉన్నారు. భారీ వర్షాలతో వీరు వ్యాపారాలు లేక, పనులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం పట్టణంలోని గౌరమ్మ పది రోజులుగా పండ్ల అమ్మకాలను బంద్ చేసింది. ఆసరా పెన్షన్ రాకపోవడంతో సమీపంలోని దుకణాదారుల వద్ద అప్పు చేసి రోజులు వెళ్లదీస్తోంది. సాయినగర్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన షేక్ నూరును భర్త వదిలేయగా, ఇద్దరు పిల్లలతో పింఛన్ రాక తిప్పలు పడుతుంది. గిరిబాబు అనే దివ్యాంగుడు వృద్ధురాలైన తల్లితో కలిసి పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్నాడు. రెండు నెలలుగా పెన్షన్ రాక బంధువులు, స్నేహితుల వద్ద డబ్బులు బాకీ తీసుకుంటూ గడుపుతున్నామని వాపోయారు.
చుట్టు పక్క ఇళ్లల్లో బిచ్చమెత్తుకుంటున్నా..
రెండు నెలల నుంచి పెన్షన్ డబ్బులు రాలేదు. అవి వచ్చేంత వరకు తిండికి లేక పక్క ఇళ్లల్లో బిచ్చమెత్తుకుంటున్నాను. నాకు ఒక కాలు లేకపోవడంతో పెన్షన్ తీసుకోవడానికి వెళ్లాలంటే ఆటోకి రూ.200 కిరాయి అవుతుంది. రెండు సార్లు ఆటోలో పోయిన. డబ్బులు పడకపోవడంతో ఉన్న నాలుగు వందలు అయిపోయినయ్.నాలాంటోళ్లకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇయ్యాలి. - కుక్కల వీరమ్మ, ముదిగొండ, ఖమ్మం జిల్లా