బడిబాట పట్టిన 92 ఏళ్ల బామ్మ..

 బడిబాట పట్టిన 92 ఏళ్ల బామ్మ..

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సలీమా ఖాన్ (92) అనే వృద్ధురాలు ఇప్పుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరుపిస్తూ తొమ్మిది పదుల  వయసులో పుస్తకాలు చేతబట్టి బడి బాట పట్టింది. ఏకంగా చిన్న పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా స్కూల్ లో పాఠాలు వింటున్నారు. ఆమె స్కూల్ కు వెళ్లడం గమనించిన కొందరు యువకులు పిల్లల మధ్య చదువుకుంటుండగా సలీమా ఖాన్ ను సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది.

 సలీమా ఖాన్ 1931లో జన్మించింది. ఆమెకు 14 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. చదువుకోవాలని ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల ఆ పని చేయలేకపోయింది. తమ గ్రామంలో అప్పట్లో బడి లేదని చెప్పింది. ఆరు నెలల క్రితం నుంచి బడికి వెళుతోంది. తనకు కనీసం డబ్బులు లెక్కపెట్టడం కూడా రాదని తెలిపింది. దీంతో తన నుంచి తన మనవళ్లు కొన్ని ట్రిక్స్ ఉపయోగించి అధికంగా డబ్బు తీసుకునేవారని చెప్పింది. ఇప్పుడు ఆ ట్రిక్కులు తన వద్ద పనిచేయవని స్పష్టం చేసింది.


ఆమెను స్థానిక విద్యాశాఖాధికారి లక్ష్మీ పాండే ప్రశంసించారు. సలీమా ఖాన్ కథ అందరికీ స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, జ్ఞానాన్ని సంపాదించేందుకు వయసుతో పనిలేదని ఆమె మరోసారి రుజువు చేసిందని చెప్పారు. ఆమె బడికి వెళ్లడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె గ్రామంలోని మరో 25 మంది మహిళలు కూడా విద్యను అభ్యసించేందుకు వస్తున్నారని స్థానిక టీచర్లు చెప్పారు.

 చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే వయసుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించవచ్చని దేశంలో చాలా మంది నిరూపించారు. అటువంటి వారి జాబితాలోనే తాజాగా చేరింది ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని బులంద్‌షహర్‌కు చెందిన 92 ఏళ్ల బామ్మ సలీమా ఖాన్.ఆమె ఈ వయసులో స్కూల్ కి వెళుతోంది. ఇప్పుడు ఆమె చూసి స్ఫూర్తి పొంది మరికొంత మంది మహిళలు బడి బాట పట్టారు.