
కొవిడ్ ఎంతోమంది జీవితాలను దెబ్బతీసింది. 87 ఏళ్ల ఉషాగుప్తా జీవితంలో కూడా విషాదం నింపింది. అరవై ఏళ్లు తనే ప్రాణంగా బతికిన భర్తని కొవిడ్ పట్టుకెళ్లింది. సెకండ్ వేవ్‌లో 27 రోజులు చావుబతుకుల మధ్య పోరాడి ఉష భర్త రాజ్ కుమార్ చనిపోయాడు. కానీ, ఆ బాధతోనే కాలం వెళ్లదీయాలనుకోలేదు ఆమె. తన భర్తలా కొవిడ్ బారిన పడిన వాళ్లకోసం తనకు చేతనైన సాయం చేయాలనుకుంది. కరోనా ట్రీట్మెంట్కి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకి చెయ్యి అందించాలనుకుంది. అందుకోసం 87 ఏళ్ల వయసులో పచ్చళ్ళు అమ్మడం మొదలుపెట్టింది ఈ బామ్మ. జూలైలో మనవరాలు రాధిక సాయంతో కొవిడ్ బాధితుల కోసం పచ్చళ్ళ బిజినెస్ మొదలుపెట్టింది. ‘పికిల్స్ విత్ లవ్’ పేరుతో 200 గ్రాముల పచ్చళ్ళ బాటిల్స్‌ని 150 రూపాయలకి అమ్ముతోంది. ఈ పచ్చడి సీసాలని కలర్‌ఫుల్ రిబ్బన్స్‌తో డెకరేట్ చేసి, ఒక నోట్ రాసి అంటిస్తోంది. బామ్మ ఆలోచనతో పాటు టేస్ట్ కూడా బాగుండటంతో పచ్చళ్ళ కోసం కస్టమర్స్ క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా బామ్మ చేతి వెజిటబుల్, చింతకాయ పచ్చళ్ళకి ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఎగబడి కొంటున్నారు. అలా సంపాదించిన డబ్బంతా కొవిడ్ బాధితుల కోసమే ఖర్చు చేస్తున్న ఈ బామ్మ మనసు బంగారం!