అహో అలీసన్‌‌!..12 స్వర్ణాలతో బోల్ట్ రికార్డ్ బ్రేక్

అహో అలీసన్‌‌!..12 స్వర్ణాలతో బోల్ట్ రికార్డ్ బ్రేక్

వంద మీటర్ల రేస్‌‌లో గోల్డ్‌‌ నెగ్గిన అమెరికా స్ప్రింటర్‌‌ కోల్‌‌మన్‌‌పై పొగడ్తల వర్షం కురుస్తుండగా.. ఉసేన్‌‌ బోల్ట్‌‌ వారసుడు అతనే అన్న చర్చ నడుస్తుండగా.. అదే దేశానికి చెందిన మిక్స్‌‌డ్‌‌ రిలే టీమ్‌‌ వరల్డ్‌‌ రికార్డులు బద్దలు కొడుతూ బంగారు పతకం గెలిచింది. అలీసన్‌‌ ఫెలిక్స్‌‌, విల్‌‌బర్డ్‌‌ లండన్‌‌, కర్డ్నీ ఒకోలొ, మైకేల్‌‌ చెర్రితో కూడిన అమెరికా టీమ్‌‌ 3 నిమిషాల 09.34 సెకండ్ల టైమింగ్‌‌తో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచింది. సిల్వర్‌‌ గెలిచిన జమైకా (3ని. 11.78సె)పై స్పష్టమైన ఆధిక్యం సాధించిందా జట్టు. బహ్రెయిన్‌‌ (3 ని. 11.82 సె) కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్‌‌లో కొత్తగా చేర్చిన ఈ మిక్స్‌‌డ్‌‌ రిలే ఈవెంట్‌‌ను ఫ్యాన్స్‌‌ ఆసక్తిగా గమనించారు. జట్టుగా అమెరికా రికార్డు టైమింగ్‌‌ నమోదు చేసినా.. అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 33 ఏళ్ల అలీసన్‌‌ ఫెలిక్స్‌‌. ఫైనల్లో సెకండ్‌‌ లెగ్‌‌లో పరుగెత్తి తన జట్టును చాంపియన్‌‌గా నిలిపిన ఫెలిక్స్‌‌ వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌లో అత్యధికంగా పన్నెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌ గెలిచిన అథ్లెట్‌‌గా ఉసేన్‌‌ బోల్ట్‌‌ను అధిగమించింది. వీటితో పాటు 3 రజతాలు, 2 కాంస్యాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. 11 స్వర్ణాలు సహా 14 మెడల్స్‌‌ గెలిచిన బోల్ట్‌‌ రెండేళ్ల కిందట కెరీర్‌‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌‌లో అత్యధిక గోల్డ్‌‌ మెడల్స్‌‌ నెగ్గిన మహిళా అథ్లెట్‌‌గా నిలిచిన అలీసన్‌‌.. ఇప్పుడు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బోల్ట్‌‌ రికార్డును బద్దలు కొట్టింది.

పతకాల రాణి.. రిలేలో రారాణి..

కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌‌, స్కూల్‌‌ టీచర్‌‌ దంపతులకు పుట్టిన అలీసన్‌‌ ఫెలిక్స్‌‌.. అమెరికా జూనియర్‌‌ చాంపియన్‌‌ అయిన తన అన్నను చూసి అథ్లెటిక్స్‌‌పై ఇష్టం పెంచుకుంది. స్కూల్‌‌ డేస్‌‌లో బొద్దుగా ఉండే అలీసన్‌‌ అంత వేగంగా పరిగెత్తేది కాదు. ఆమె ఆకారాన్ని చూసి ‘చికెన్‌‌ లెగ్స్‌‌’అంటూ ఫ్రెండ్స్‌‌ ఆట పట్టించేవారు. కానీ, స్కూల్‌‌ కోచ్‌‌ జొనాథన్‌‌ పాటాన్‌‌ ప్రోత్సాహంతో అథ్లెట్‌‌గా మారాలని అలీసన్‌‌ తొమ్మిదో క్లాస్‌‌లో నిర్ణయించుకుంది. పట్టుదలతో శ్రమించి చాలా తక్కువ టైమ్‌‌లోనే నేషనల్‌‌ లెవల్‌‌లో తన పేరు మార్మోగేలా చేసింది. 18 ఏళ్ల వయసులో 2004 ఒలింపిక్స్‌‌లో పోటీ పడ్డ అలీసన్‌‌ 200 మీ. రన్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌ నెగ్గి తొలిసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తర్వాతి ఏడాది వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో 200 మీ. రేస్‌‌లో గోల్డ్‌‌ గెలిచిన యంగెస్ట్‌‌ అథ్లెట్‌‌గా రికార్డు సృష్టించింది. అలా షురూ అయిన ఆమె జోరు అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. 200, 400 మీటర్లతో పాటు 4x 100, 4 x400 మీటర్ల రిలేల్లో పసిడి పరుగులు తీస్తోంది. 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్స్‌‌ సహా పలు మేజర్‌‌ టోర్నీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ పెర్ఫామెన్స్‌‌ చేయలేదామె. దాంతో, కొంతకాలం తర్వాత ఆ ఈవెంట్‌‌ నుంచి తప్పుకున్న అమెరికన్‌‌ 200 మీటర్ల విభాగంలో 2012 ఒలింపిక్‌‌ చాంపియన్‌‌గా నిలిచింది 2005, 2007 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో స్వర్ణాలు గెలిచింది. 400 మీటర్లలో ఒలింపిక్‌‌ గోల్డ్‌‌ అందుకోలేకపోయినా.. 2015 వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌లో పసిడి ఖాతాలో వేసుకుంది. వీటన్నింటికంటే కూడా రిలేల్లో ఆమె ఎక్కువ సక్సెస్‌‌ సాధించింది. ఒలింపిక్స్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో గెలిచిన 18 స్వర్ణాల్లో 15 రిలేల్లోనే వచ్చాయి. లండన్‌‌, రియో ఒలింపిక్స్‌‌లో 4×100, 4×400 మీటర్ల రిలేల్లో గోల్డ్‌‌ కొట్టిన ఫెలిక్స్‌‌.. 2007, 2011, 2017 వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లోనూ అదే ఫలితాన్ని సాధించి రిలే రారాణిగా మారిపోయింది.

అమ్మగానూ గెలిచింది

గతేడాది అలీసన్‌‌ కెరీర్‌‌లో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. నవంబర్‌‌లో పాపకు జన్మనిచ్చి అమ్మగా మారిన ఆమె.. ఆ క్రమంలో శారీరకంగా, మానసికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది. ప్రసవ సమయంలో  ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎమర్జెన్సీ సి–-సెక్షన్‌‌తో డెలివరీ చేయాల్సి వచ్చింది. తనకు స్పాన్సరర్‌‌గా ఉన్న నైకీ సంస్థ ఈ సమయంలో తనకు సహకరించలేదని అలీసన్‌‌ ఆరోపించింది. వీలైనంత తొందరగా మళ్లీ కాంపిటీషన్‌‌లోకి రావాలని తొందరపెట్టిందని చెప్పింది. బిడ్డ పుట్టిన తర్వాత పెర్ఫామెన్స్‌‌ డౌన్‌‌ అయితే తనకు ఇచ్చే మొత్తంలో 70 శాతం కోత పెడతామన్న నైకీతో ఏడేళ్ల అనుబంధాన్ని తెంచుకున్న ఫెలిక్స్‌‌.. మూడు నెలల కిందటే మళ్లీ ట్రాక్‌‌పైకి అడుగుపెట్టింది. జులైలో జరిగిన యూఎస్‌‌ఏ ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ 400 మీటర్ల విభాగంలో పోటీ పడి ఏడో స్థానంలో నిలిచింది. దాంతో, దోహా వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌లో ఆమెపై ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ, మూడు నెలల్లోనే ఆమె మళ్లీ మునుపటి వేగాన్ని అందుకుంది. ఫలితంగా గ్యాలరీ నుంచి తన కూతురు చూస్తుండగా.. మిక్స్‌‌డ్‌‌ రిలేలో వరల్డ్‌‌ రికార్డుతో పాటు బోల్ట్‌‌ అత్యధిక స్వర్ణాల రికార్డును బద్దలుకొట్టింది. అంతకంటే ముఖ్యంగా అమ్మగానూ గెలిచిన ఈ గోల్డెన్‌‌ లేడీ  వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌‌లోనూ అదరగొట్టాలని భావిస్తోంది.