ఒమిక్రాన్ వేరియంట్‌పై అలర్ట్: 2 గంటల పాటు మోడీ రివ్యూ

V6 Velugu Posted on Nov 27, 2021

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లకు లొంగే అవకాశం లేకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ (శనివారం) అత్యవసరంగా రివ్యూ నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా పలు దేశాల్లో గుర్తించి ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తీవ్రత, దాని ప్రభావం వంటి అంశాలను ప్రధాని మోడీకి అధికారులు వివరించారు.  ఈ వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారని పీఎంవో అధికారి ప్రకటనలో పేర్కొంది.

విదేశాల నుంచి వచ్చే వాళ్లకు టెస్టులు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు గతంలో మాదిరిగా టెస్టులు చేయాలని, కొత్త వేరియంట్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మోడీ సూచించారు. విదేశాల నుంచి వచ్చే వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపాలన్నారు. అలాగే డిసెంబర్ 15 నుంచి విదేశీ ఫ్లైట్ల రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి రివ్యూ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయాలె

కొత్త వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంతో పాటు ఇంకా కేసులు భారీగా వస్తున్న ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవగాహన పెంచాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా అన్ని జాగ్రత్తలు కఠినంగా అమలు చేయాలని సూచించారు.

దేశంలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలని, ఫస్ట్ డోసు తీసుకున్న వాళ్లు కచ్చితంగా సరైన కాల పరిమితిలోపు రెండో డోసు కూడా వేసుకునేలా చూడాలని రాష్ట్రాలకు మార్గనిర్దేశనం చేశారు. ‘హర్ ఘర్ దస్కత్‌’ పేరుతో నిర్వహిస్తున్న డోర్‌‌ టు డోర్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.

 

Tagged pm modi, corona vaccine, corona tests, international flights, omicron, Omicron Covid variant

Latest Videos

Subscribe Now

More News