స్కూల్‌లో భారీగా కరోనా కేసులు.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌

స్కూల్‌లో భారీగా కరోనా కేసులు.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌

దేశాన్ని  కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కొత్తగా వచ్చి ఒమిక్రాన్ వేరియంట్ ఓ వైపు భయపెడుతుంటే.. కొద్ది రోజులుగా స్కూళ్లు, కాలేజీల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కొన్ని గురుకుల స్కూళ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు వచ్చాయి. ఇప్పుడు కర్ణాటకలోని ఓ స్కూల్‌లో ఏకంగా 101 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిక్‌మగళూర్‌‌ జిల్లాలోని ఓ పాఠశాలలో శనివారం నాడు టెస్టులు చేయగా.. 59 మంది పిల్లలు, 10 మంది స్టాఫ్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఉమేశ్ తెలిపారు. దీంతో వారం పాటు స్కూల్ మూసేయాలని ఆదేశించామన్నారు. అయితే మొత్తం 457 మంది శాంపిల్స్ సేకరించి టెస్టులు చేశామని, అందులో కొంత మంది రిపోర్టులు ఇవాళ (సోమవారం) వచ్చాయని ఉమేశ్ చెప్పారు.

ఇవాళ రిపోర్ట్ వచ్చిన వాళ్లతో కలిసి మొత్తం స్కూల్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ల సంఖ్య 101కి చేరిందన్నారు. ఇందులో 90 మంది విద్యార్థులు, 11 మంది స్టాఫ్ ఉన్నారని తెలిపారు. కరోనా సోకిన వారిలో దాదాపు చాలా మందికి ఎటువంటి లక్షణాలు లేవన్నారు. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని డాక్టర్ ఉమేశ్ చెప్పారు.