ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇండియాకు రావడానికి జంకుతున్న టూరిస్టులు

ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఇండియాకు రావడానికి జంకుతున్న టూరిస్టులు

న్యూఢిల్లీ: కరోనా రెండు వేవ్స్ వల్ల బాగా ప్రభావితమైన రంగాల్లో టూరిజం కూడా ఒకటి. లాక్ డౌన్ లు, ట్రావెల్ నిబంధనలతో ఈ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. అయితే కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో టూరిజం సెక్టార్ తిరిగి గాడిలో పడినట్లే కనిపించింది. కానీ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల పర్యాటక రంగం తిరిగి సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. భారత్ కు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్న వారు ఒమిక్రాన్ భయంతో వెనక్కి తగ్గుతున్నారు. హాలీడే సీజన్ లో ఇండియా విజిటింగ్ కు రావాలనుకున్న వారు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ టూరిజంపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా పడుతుందో చూద్దాం.. 

కుదేలవుతున్న టూరిజం 

ఒమిక్రాన్ భయందోళనలతో భారత్ కు రావడానికి చాలా మంది జంకుతున్నారు. ఇది దేశీ టూరిజంపై మెళ్లిగా ప్రభావం చూపుతోంది. గత మూడ్రోజుల్లో దాదాపు 20 శాతం మంది విదేశీ పర్యాటకులు తమ ఇండియా టూర్ ను రద్దు చేసుకోవడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. 

  • గతేడాది లాక్ డౌన్లు, ట్రావెల్ ఆంక్షల తర్వాత తిరిగి కోలుకుంటున్న పర్యాటక రంగంపై ఒమిక్రాన్ రూపంలో పెద్ద దెబ్బ పడేలా ఉంది. క్రిస్ మస్, న్యూ ఇయర్ సెలవుల నేపథ్యంలో చాలా మంది పర్యాటకులు దుబాయ్, యూరోప్ తోపాటు యూఎస్ కు టూర్లు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఒమిక్రాన్ భయంతో ఆ టూర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారని చెన్నైకి చెందిన మధుర ట్రావెల్ సర్వీసెస్ కంపెనీ ఎండీ శ్రీహరన్ బాలన్ తెలిపారు. అంటే భారత్ తోపాటు మిగిలిన దేశాల పర్యాటక పైనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. 
  • కరోనా వల్ల దేశంలో బాగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అందుకే ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వేరియంట్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు మహా సర్కారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్రావెల్ ఆంక్షలు విధించింది. మహారాష్ట్రలాగే మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే పర్యాటక రంగం మీద పెను ప్రభావం పడక తప్పేలా లేదు. 
  • కరోనా మహమ్మారికి ముందు దేశీ పర్యాటక రంగం మంచి ఊపు మీద ఉండేది. తమిళనాడునే చూసుకుంటే.. 2019 వింటర్ హాలీడే సీజన్ లో ఆ రాష్ట్రంలోని మూడు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులకు కలిపి సుమారుగా 5 లక్షల మంది ట్రావెలర్స్ రావడం గమనార్హం. కానీ 2020లో అదే సీజన్ లో తమిళనాడులోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ సందర్శన విషయంలో కరోనా కారణంగా జీరో గ్రోత్ నమోదైంది. ఈ ఏడాది సరిగ్గా ఇదే సమయానికి ఒమిక్రాన్ వ్యాప్తి భయాందోళనలు నెలకొనడంతో పర్యాటక రంగంపై మళ్లీ ఎఫెక్ట్ చూపుతోంది.