24న కేసీఆర్, జగన్ భేటీ.. పెండింగ్ సమస్యలపై చర్చ

24న కేసీఆర్, జగన్ భేటీ.. పెండింగ్ సమస్యలపై చర్చ

ఈ నెల 24న మరోసారి భేటీ కానున్నారు తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల,  కేంద్రం వైఖరిపైనా భేటీలో మాట్లాడే అవకాశం ఉంది. అయితే మీటింగ్ హైదరాబాద్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య ఇప్పటికే మూడుసార్లు సమావేశాలు జరిగాయి. పలు అంశాలపై అంగీకారం కుదిరింది.  తర్వాత మరికొన్నిసార్లు భేటీ జరగాల్సి ఉన్నా…శాసనసభా సమావేశాలు, ఇతర కారణాల వల్ల జరగలేదు.  ప్రస్తుతం తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల విభజన,  గోదావరి,  కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం అంశాలు పెండింగ్ లో ఉన్నాయి.  గతంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆర్థికపరమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కేంద్ర వ్యవహార శైలిపైనా చర్చ

ఈనెల 24న జరిగే సమావేశంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపైనా  కేసీఆర్, జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంలపై రెండు రాష్ట్రాల బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్న  అభిప్రాయం రాష్ట్ర  ప్రభుత్వాల్లో ఉంది. దీనిపై ఎలా ముందుకు వెళితే బాగుంటుందన్నది చర్చించనున్నట్లు సమాచారం.