ప్రతిపక్షాలకు..సెప్టెంబర్​ షాక్​లు

ప్రతిపక్షాలకు..సెప్టెంబర్​ షాక్​లు

‘షాక్ ’ అనేది వందల సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న సైనిక వ్యూహం. ఒక సైన్యం తమ సైనికుల రక్తాన్ని ఎక్కువగా చిందించకుండా శత్రువును జయించాలని కోరుకున్నప్పుడు,  శక్తి యుక్తులు తమవద్ద ఉన్నప్పుడు విజయం సాధించడం సులభమవుతుంది.  శత్రువును దిగ్భ్రాంతి, విస్మయానికి గురిచేసేలా భారీ దాడి చేస్తే విజయం తథ్యం.  1991లో కువైట్‌‌‌‌ను ఆక్రమించిన ఇరాక్‌‌‌‌ను ఓడించాలని  అమెరికా కోరుకున్నప్పుడు ఇదే జరిగింది.  అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఇరాక్‌‌‌‌ను విస్మయానికి గురిచేసి షాక్​ అయ్యేలా  ముప్పేట దాడిని చేశాడు. దీంతో  ఇరాక్ ఓటమిపాలైంది. చాలా దేశాలు ఇటువంటి యుద్ధ వ్యూహాలను తరచుగా ఉపయోగిస్తాయి. రాజకీయ రంగానికీ ఈ సూత్రం వర్తిస్తుంది.  సెప్టెంబర్, 2023 నెల ప్రారంభమైనప్పుడు, ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా సెప్టెంబర్ 1, 2023న ముంబైలో తన సమావేశాన్ని నిర్వహిచింది.  బీజేపీని వ్యతిరేకించే రాజకీయపార్టీల భారీ సమావేశం దేశ ప్రజలను,  మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా మీటింగ్ జరిగింది. అయితే ప్రతిపక్షాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఎటువంటి ప్రతిచర్యను ఊహించలేదు.  కానీ, సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రతిపక్షాలకు ఇచ్చిన షాక్​తో భారత ప్రతిపక్ష కూటమి తమ సమావేశాన్ని మర్చిపోయింది.  

సెప్టెంబరు మొదటి తేదీన నరేంద్ర మోదీ ‘జమిలి ఎన్నికల’ గురించి మాట్లాడారు. దీంతో  దేశం దృష్టి ప్రతిపక్షాల సమావేశాన్ని కాదని జమిలి ఎన్నికలపై పడింది. జమిలి ఎన్నికలు ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారనే దానిపై దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. మరుసటి రోజు సెప్టెంబరు 2, 2023న, జమిలి ఎన్నికలను నిర్వహించే మార్గాలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల’ కమిటీని నియమించింది. ప్రతిపక్షాలు విస్మయం నుంచి కోలుకోకుండానే సెప్టెంబర్ 3న బీజేపీ ప్రభుత్వం అకస్మాత్తుగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.

వ్యూహాత్మకంగా వరుస నిర్ణయాలు

సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు  5రోజులపాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని మోదీ సర్కారు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ చట్టాలను ప్రవేశపెడతారనే దానిపై దేశప్రజల్లో గొప్ప ఊహాగానాలకు దారితీసింది. జమిలి ఎన్నికల చట్టాలు, ఇతర బిల్లులపై మీడియాలో చర్చలు  జరిగాయి. అయితే మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రత్యేక సమావేశానికి సంబంధించి ఎలాంటి అజెండాను ప్రస్తావించలేదు. మరోవైపు సెప్టెంబర్ 3, 2023న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలను 6 నెలల ముందస్తుగా నిర్వహించే పూర్తి అధికారాలు తమకు ఉన్నాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కు అన్నిరకాల శక్తి సామర్థ్యాలను కలిగి ఉందని అన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 10 వరకు  దేశరాజధాని ఢిల్లీ వేదికగా జీ-20 సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఘనంగా జరిగింది. ఇది ఏటా జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సమావేశం కావడంతో దేశం ఈ ఈవెంట్‌‌‌‌పై ప్రధానంగా దృష్టి సారించింది. జీ20  సదస్సు జరిగినన్ని రోజులు దేశవ్యాప్తంగా మీడియా మొత్తం అంతర్జాతీయ సమిట్​కే ప్రాధాన్యం ఇచ్చింది.  పార్లమెంటు ప్రత్యేక సెషన్ ​తేదీలను ప్రకటించిన మోదీ సర్కారు అకస్మాత్తుగా సెప్టెంబర్ 13 న  ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను కూడా ప్రకటించింది. అయితే ఆ ఆజెండాలో ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు. పార్లమెంటు ప్రత్యేక సెషన్​లో ఇతర బిల్లులను కూడా ప్రవేశపెట్టవచ్చని హింట్ ఇవ్వడంతో రాజకీయవర్గాల్లో ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. 

ALSO READ: 85 సీట్లలో మేమే గెలుస్తం .. అధికారంలోకి వస్తం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

జాగ్రత్తలు తీసుకున్న ప్రతిపక్షాలు

సెప్టెంబర్ నెలలో నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు,  ఖలీస్తానీలను హత్యచేయించినట్లు కెనడా ప్రభుత్వ ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టడం, జీ20 శిఖరాగ్ర సదస్సును ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించడాన్ని ప్రతిపక్ష పార్టీలు, నేతలు ఎవరూ ఊహించలేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, జమిలి ఎన్నికలపై మాజీ రాష్ర్టపతి రామ్‌‌‌‌నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ ఏర్పాటు భారత రాజకీయాలను పూర్తిగా శాసించాయి. బహుశా మోదీని ఓడించబోతున్నామని ప్రతిపక్షాలు ప్రగల్భాలు పలుకకూడదని, ఇతర తీవ్ర ఆరోపణలు చేయకూడదనే ఆలోచనకు వచ్చాయి. మోదీ ప్రభుత్వంపై కఠిన ఆరోపణలు చేస్తే నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొలిపి తమపై బీజేపీ ప్రభుత్వం దాడి చేసేలా చేయించుకోవడమే అనే భావన ప్రతిపక్షాల్లో కలిగింది. 

తరచూ షాక్​లు కుదరవు

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి.   దేశ ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలను వీలైనంత మేరకు చిత్తశుద్ధితో అమలు చేయాలి. ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ఇతర ప్రధాన విషయాలపై మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎక్కువ ఉత్సాహం ఉంటే  అది వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మితిమీరిన ఉత్సాహాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా నివారించుకోవాలి. టెన్షన్ , ఆశ్చర్యాలను సృష్టించి ప్రతిపక్షాలపై ఆధిపత్యం సాధించడంతో నరేంద్ర మోదీకి సెప్టెంబర్ నెల ఫలవంతమైనది. జీ20 అంతర్జాతీయ సమిట్​ గొప్ప విజయాన్ని సాధించడంతో ప్రతిపక్షాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. దీంతో మౌనాన్ని ఆశ్రయించాయి. వాటికి పెద్దగా విమర్శించడానికి ప్రత్యేకంగా ఏ అంశం లేదు. అయితే, బీజేపీయేతర పార్టీలు కొన్ని చేసిన విమర్శలు హాస్యాస్పందంగా మారాయి. మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.  కానీ మోదీ షాక్‌‌‌‌తో విపక్షాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సర్కారు తరచుగా అలాంటి ఉత్సాహాన్ని పునరావృతం చేయలేదు. ప్రజలు ఎక్కువగా మోదీ ప్రభుత్వ విజయాలకు అలవాటు పడతారు. అలా జరగకపోతే నిరాశకు గురవుతారు. 

శత్రువు తప్పులను సహనంతో చూడాలి

200 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ చెప్పినట్లుగా.. మీ శత్రువు తప్పులు చేస్తున్నప్పుడు అతనికి ఎటువంటి అంతరాయం కలిగించకూడదు. శత్రువు చేసిన తప్పులే అతడి ఓటమికి కారణమవుతాయి.  ఈ సూత్రాన్ని అనుసరించి నరేంద్ర మోదీ తప్పులు చేస్తుంటే విపక్షాలు ఎక్కువగా ముందే జోక్యం చేసుకోకపోవడమే వాటికి శ్రేయస్కరం. ప్రతిపక్షాల సహనం ఎన్నికల సమయానికి అక్కరకు వస్తుంది. విజయపథాన దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మితిమీరిన ఉత్సాహాన్ని సృష్టించకూడదు. సెప్టెంబరులో  జీ20 సమావేశం, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు మొదలైన వాటితో కేంద్ర ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించిన ప్రత్యేక నెల అనడంలో సందేహం లేదు. 

కెనడా ఆరోపణను తిప్పికొట్టిన మోదీ

ఒకవైపు పార్లమెంటు ప్రత్యేక సెషన్​ కొనసాగుతుండగానే మరోవైపు సెప్టెంబరు 18న కెనడా ప్రధానమంత్రి ట్రూడో  సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా పార్లమెంట్‌‌‌‌లో కొంతమంది ఖలిస్తానీ సిక్కుల హత్యల వెనుక భారతదేశం ప్రమేయం ఉందని ప్రకటించారు. ఖలిస్తానీ నిజ్జర్ హత్యను భారత ప్రభుత్వం కూడా  తీవ్రంగా ఖండించి ట్రూడోకు చెక్​పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ  ప్రభుత్వం బలంగా ఉందని, భారతదేశాన్ని కాపాడే సత్తా మోదీ సర్కారుకు ఉందని ప్రజలు విశ్వసించారు. మోదీ వరుస షాక్​లతో  ప్రతిపక్షాలు కంగుతిన్నాయి.

కొత్త పార్లమెంటులో మొదటి బిల్లు సంచలనం

18వ తేదీన పార్లమెంటు ప్రత్యేక సెషన్​ ప్రారంభమైంది. ఈక్రమంలో సెప్టెంబర్ 19వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఎంపీలు పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త భవనానికి మారారు. దీంతో భారతదేశ చరిత్రలో నూతన చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.  కొత్త పార్లమెంటు బిల్డింగ్​లో సమావేశాలు మొదలవగానే సెప్టెంబర్ 20న బీజేపీ ప్రభుత్వం 27 ఏండ్ల  క్రితం వెలుగుచూసిన మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ  సభలో ప్రవేశపెట్టింది. ఆకస్మిక వార్తలు,  రాజకీయ పార్టీల సంచలనం,  పెను ప్రభావంతో దేశం మళ్లీ  ఆశ్చర్యపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది.  చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లు ఇప్పటికీ మీడియాను ఆకర్షిస్తోంది.

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్​