నీరజా బానోత్... దేశం కోసం ప్రాణాలొదిలిన వీర వనిత

నీరజా బానోత్... దేశం కోసం ప్రాణాలొదిలిన వీర వనిత

నీరజా బానోత్‌... ఇండియన్ ఎయిర్ హోస్టెస్. విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో సమయస్ఫూర్తితో  వ్యవహరించి వందల కొద్దీ ప్రయాణికులను రక్షించిన వీర వనిత. 23 ఏళ్ల వయసులోనే ప్రాణ త్యాగం చేసి దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన గొప్ప మహిళ. 1986 సెప్టెంబర్ 5న ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నీరజ చనిపోయారు. ఆమె మరణానంతరం భారత ప్రభుత్వం ‘అశోక చక్ర’ ప్రకటించింది. 2016లో నీరజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని సినిమా కూడా తీశారు. 

1986, సెప్టెంబర్ 5న అసలు ఏం జరిగిందంటే...?

1986, సెప్టెంబర్‌ 5న అమెరికా విమానం ముంబయి నుంచి బయలుదేరింది. ఆ విమానంలో నీరజా బానోత్‌ ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తోంది. పాకిస్తాన్‌లోని కరాచీలో నలుగురు టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్‌ చేశారు. వారు ఎయిర్ పోర్టు సెక్యూరిటీ ఆఫీసర్ల డ్రెస్సులు వేసుకుని విమానంలోకి చొరబడ్డారు. అయితే ఇది గమనించిన  నీరజ కాక్ పిట్ లో ఉన్న పైలట్లను అలర్ట్ చేసింది. ఆ పిరికి పైలట్లు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పారాశూట్ల సాయంతో విమానం దిగి పారిపోయారు. కానీ నీరజ అలా చేయలేదు. ప్రయాణికులను ఎలాగైనా కాపాడాలన్న ఉద్దేశంతో లోపలే ఉంది. ఆ విమానంలో 365 మంది ప్రయాణీకులు, 13 మంది విమాన సిబ్బంది ఉన్నారు. అయితే తమ వాళ్లను విడిపించుకునేందుకు అమెరికన్లను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు...  పాస్ పోర్టు ఆధారంగా వాళ్లను బందీలుగా పట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం వారి నుంచి పాస్ పోర్టులను కలెక్ట్ చేయాలని నీరజను ఆదేశించారు. పాస్‌పోర్టులు సేకరిస్తున్న నీరజ  మిగతా సిబ్బందితో కలిసి సమయస్ఫూర్తితో వ్యవహరించి  అమెరికన్‌ల పాస్‌పోర్టులు వారికి చిక్కకుండా మిగతావారి పాస్‌పోర్టులను హైజాకర్లకు ఇచ్చింది. విమానంలో అమెరికన్లు ఎవరో, అమెరికన్లు కాని వారు ఎవరో గుర్తించలేకపోయిన హైజాకర్లు విమానాన్ని పేల్చేయాలని నిర్ణయించుకున్నారు.

గంటలకొద్ధీ ఉగ్రవాదులను నిలువరించిన నీరజ

ప్రయాణికులను కాపాడేందుకు నిశ్చయించుకున్న నీరజ... ఉగ్రవాదులను గంటలకొద్దీ నిలువరించగలిగింది. అయితే 17 గంటల పాటు విమానాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్న ఉగ్రవాదులు... ప్రయణికులను ఒక్కొక్కరిగా చంపడానికి ప్రయత్నించారు. అప్పుడే నీరజ ఎమెర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను పారిపోమని చెప్పింది. నిజానికి డోర్ ఓపెన్ చేయగానే తానే దూకేయాలి. కానీ తాను అలా చేయలేదు. అప్పటికే పారిపోతున్న ప్రయాణికులపై ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపిస్తుంటే... ఓ ముగ్గురి పిల్లలకి రక్షణ కవచంలా నిల్చొని వారి ప్రాణాలను కాపాడింది. ఉగ్రవాదులు మొత్తం 20 మందిని చంపేశారు. కానీ నీరజ ప్రాణ త్యాగం వల్ల 360 మంది ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. చివరికి ఆ ఉగ్రవాదులు పోలీసులకి దొరికిపోయారు. ఇలా ఎందరో ప్రాణాలను కాపాడిని నీరజా బానోత్ వీర వనితగా చరిత్రలో నిలిచిపోయింది. మరణానంతరం ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. 2004లో భారత పోస్టల్‌ సర్వీస్‌ ఆమె జ్ఞాపకార్ధం నీరజా బానోత్‌ పేరుతో పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. భారత ప్రభుత్వం అత్యున్నత శాంతి పురస్కారమైన  ‘అశోక్ చక్ర’ ను ప్రకటించింది. 

నీరజ బ్యాక్ గ్రౌండ్

నీరజా బానోత్‌ చండీఘడ్‌ పంజాబీ కుటుంబంలో పుట్టింది. నీరజ తండ్రి హరీష్‌ బానోత్‌. తల్లి రమా బానోత్‌. వీరికి నీరజతో పాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. హరీష్‌ బానోత్‌ ముంబయికి చెందిన జర్నలిస్టు. నీరజ ప్రాథమిక విద్య చండీఘడ్‌లోని సేకర్డ్ హర్ట్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో సాగింది.  వీరి కుటుంబం ముంబయికి షిఫ్ట్ అయిన  తరువాత నీరజ అక్కడి బాంబే స్కాటిష్‌ స్కూల్‌లో చేరారు. ఆ తరువాత ముంబయిలోని సెంట్‌ జేవియర్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. 

అనంతరం మోడలింగ్ లోకి అడుగు పెట్టారు. మోడలింగ్‌ చేస్తూనే పాన్‌ అమెరికన్‌ విమానంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 1985లో ఫ్రాంక్‌ఫర్ట్‌ నుండి భారత్‌ మార్గంలో ప్రయాణించే విమానంలో ఆమెకు ఉద్యోగం లభించింది. శిక్షణలో భాగంగా ఆమె మియామి, ఫ్లోరిడా వెళ్లవలసి వచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న నీరజ ఒకవైపు మోడలింగ్‌, మరోవైపు పాన్‌ అమెరికా విమానంలో ఉద్యోగం చేయసాగింది. ఈ క్రమంలోనే 1986, సెప్టెంబర్‌ 5న విమాన హైజాక్ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నీరజా బానోత్ చనిపోయారు.