ఆపదలో ఉన్నవారి ఆపద్భాందవుడు

ఆపదలో ఉన్నవారి ఆపద్భాందవుడు

తెరపై క్రూరమైన విలన్‌గా భయపెట్టాడు. తెర వెనుక మంచితనానికే మారుపేరుగా నిలిచాడు.  మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. మంచి మనసుతో ఎన్నో కుటుంబాల్లో ఆనంద జ్యోతులు వెలిగించి ఎందరో పేదల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. నాయకులు, అధికారులు కాదు.. ఆయన ఒక్కడుంటే చాలు.. బతుకులు బాగుపడుతాయని నమ్ముతున్నారు. ఒక మనిషి ఎలా బతకాలో, సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్పించిన ఆ హీరోనే సోనూ సూద్. ఆయన పుట్టిన రోజు (జులై 30 )సందర్భంగా సోనూ జీవితంలో కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

పంజాబ్‌లో పుట్టి..

1973లో.. పంజాబ్‌లోని మోగాలో పుట్టాడు సోనూ సూద్. నాగ్‌పూర్‌‌లో ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి బిజీ మోడల్ అయిపోయాడు. సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో కొన్నాళ్ల పాటు యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నాడు. కొన్ని నాటకాల్లోనూ తన ప్రతిభ చూపాడు. అయితే మొదటి అవకాశం మాత్రం బాలీవుడ్‌లో దొరకలేదు. తమిళ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించాడు సోనూ సూద్. విజయ్ కాంత్ హీరోగా నటించిన ‘కళ్లళగర్’ అనే చిత్రంలో చిన్న రోల్ చేశాడు. అదే ఏడు మరో తమిళ చిత్రంలోనూ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించాడు. ఆ తర్వాత తెలుగు మూవీ ‘హ్యాండ్సప్‌’లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేశాక గానీ బాలీవుడ్‌ అతన్ని గుర్తించలేదు. ‘షహీద్ ఎ అజమ్’ మూవీతో సోనూ బీటౌన్‌లో అడుగు పెట్టాడు. 

పర్‌‌ఫెక్ట్ విలన్

కొన్ని హిందీ సినిమాల్లో హీరోగా నటించాడు సోనూ. తెలుగు దర్శకులు మాత్రం అతనిలోని నెగిటివ్ షేడ్స్ను బాగా వాడుకున్నారు. విలన్‌ పాత్రలతో సోనూని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు. ఫిజిక్.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ.. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో అందరికీ ఫేవరేట్ అయిపోయాడు. సూపర్, అతడు, అశోక్, ఆంజనేయులు, పోకిరి, బంగారు బాబు, ఏక్ నిరంజన్, శక్తి, కందీరగ, దూకుడు తదితర చిత్రాల్లోని ప్రతి నాయకుడి పాత్రలో నెగిటివ్ రోల్స్‌ సోనూని పర్‌‌ఫెక్ట్‌ విలన్‌గా ప్రూవ్ చేశాయి. ఇక ‘అరుంధతి’లో అతడు చేసిన పశుపతి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాగుబోతుగా, అమ్మాయిల జీవితాలు నాశనం చేసే దుర్మార్గుడిగా, అఘోరాగా అదరగొట్టేశాడు. అందుకే ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది. బాలీవుడ్ మూవీలోని ‘దబంగ్’ చిత్రానికి, తెలుగు మూవీ ‘జులాయి’కి కూడా బెస్ట్ విలన్‌ అవార్డులు అందుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో పాటు సిటీ ఆఫ్ లైఫ్, కుంగుఫూ పాండా తదితర ఇంగ్లిష్ మూవీల్లో యాక్ట్ చేశాడు. పాగల్‌ నా హోనా, సాథ్‌ క్యా నిభావోగే మ్యూజిక్‌ వీడియోస్‌తోనూ మెస్మరైజ్ చేసిన సోనూ.. 2016లో తండ్రి పేరు మీద శక్తిసాగర్ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి నిర్మాతగా మారాడు.

ఆపద్బాంధవుడు

మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సోనూ. ఆమె పేరు సోనాలి. వారికి ఇద్దరు కొడుకులు. ఓ వైపు మంచి ఫ్యామిలీ మేన్‌గా, మరోవైపు చక్కని నటుడుగా అందరి మన్ననలూ పొందాడు. అయితే కొవిడ్ టైమ్‌లో అతనిలోని కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సోనూలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడో అందరికీ తెలిసొచ్చింది. కరోనా విజృంభిస్తుంటే ప్రజలు పడుతున్న కష్టాలు చూసి సోనూ కదిలిపోయాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి బస్సులు, రైళ్లు ఏర్పాటు చేశాడు. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్స్ను  స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా రప్పించాడు. ప్రవాసీ రోజ్‌గార్ వెబ్‌సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు. ఆక్సిజన్ కొరతను గుర్తించి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ని రెడీ చేశాడు. తన దృష్టికి వచ్చిన సమస్యల్ని అధికారులకు తెలిసేలా చేశాడు. అతను లేఖ రాయడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్‌‌ ఆక్సిజన్ ప్లాంట్‌ని ఏర్పాటు చేశారంటే అతని దయాగుణం గురించి అర్థం చేసుకోవచ్చు. ఇక కరోనా కారణంగా స్కూళ్లు మూతబడటంతో ఆన్‌లైన్‌ క్లాసులు అడెంట్ అవడం కోసం పేద విద్యార్థులు పడుతున్న కష్టం చూసి వారికి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాడు. 40 గ్రామాల్లోని 300 మందికి ఇచ్చాడంటే చిన్న విషయం కాదు. కరోనా తర్వాత కూడా సోనూ సేవలు ప్రజలకు అందుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నారని తెలిసినా వెంటనే రియాక్టవుతాడు. చిత్తూరు జిల్లాలోని ఓ పేద రైతు ఎద్దులు లేక, తన కూతుళ్లతో పొలం దున్నించడం చూసి కదిలిపోయాడు. తక్షణం ట్రాక్టర్ కొనిచ్చాడు. జీవనోపాధి లేదని కంటతడి పెట్టుకున్న ఓ అమ్మాయికి క్షణాల్లో పెద్ద కంపెనీలో పని ఇప్పించాడు. రోజూ తన ఇంటి గేటు దగ్గరకొచ్చి నిలబడే ప్రతి ఒక్కరి బాధనూ ఓపికగా విని చేయగలిగినంత సాయం చేసి పంపిస్తాడు.

పేదల దేవుడు

ఎదటివారికి వస్తే కొందరు పట్టించుకోరు. కొందరు పట్టించుకున్నా ఏదో కాస్త సాయం చేసి ఊరుకుంటారు. కానీ సోనూ ఒక అక్షయపాత్ర లాంటి వాడు. ఎంత మందికి పంచినా అతని నుంచి ప్రేమ ఇంకా ఇంకా పొంగుకొస్తూనే ఉంది. నిత్యం ఎంతోమంది జీవితాలను నిలబెడుతూనే ఉంది. అందుకే ప్రజలు తమ మనసుల్లో అతనికి మెస్సయ్య స్థానాన్ని ఇచ్చారు. కానీ అలా పిలిపించుకోవడం సోనూకి ఇష్టం లేదు. అందుకే జర్నలిస్ట్ మీనా అయ్యర్‌‌తో కలిసి ‘అయామ్ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు. తానేం దేవుణ్ని కాదని, అందరిలాంటి మనిషినేననీ చెప్పాడు. కానీ అది ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దేవుడు వచ్చి తాను దేవుడినని చెబితేనే నమ్మలేదు కదా. అలాంటప్పుడు తాను దేవుణ్ని కాదని మా దేవుడు చెబితే మాత్రం ఎందుకు నమ్ముతాం అంటున్నారు. వారి గుండెల్లో సోనూ స్థానం ఎప్పటికీ అదే. వాళ్లందరి ఆశీస్సులతో మరిన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించాలని, తన నటనతో మంచి మనసుతో మరిన్ని మన్ననలు అందుకోవాలని కోరుకుంటూ.. సోనూ సూద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.