హే మాధవ..హే గోవిందా..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రేటర్ సిటీలోని ఆలయాలు హరినామ స్మరణతో మార్మోగాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉత్తర ద్వార దర్శనం కోసం జనం భారీగా తరలివచ్చారు. బిర్లామందిర్, బంజారాహిల్స్ రోడ్ నం.12లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ ఆలయాలు, కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయం, చిక్కడపల్లి, రాంనగర్ గుండు, నామాలగుండు, నాగోల్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయాలు, లంగర్ హౌస్‌లోని రామాలయం, మణికొండలోని గోల్డెన్ టెంపుల్, చిలుకూరి బాలాజీ ఆలయాలకు భక్తులు పోటేత్తారు.
ప్రధాన ఆలయాల్లో దర్శనాలకు సుమారు గంటకుపైగా సమయం పట్టింది. జియాగూడలోని శ్రీ రంగనాథ స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పలు ఆలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్, సెట్టింగ్‌లు, పూల అలంకరణలు ఆకట్టుకున్నాయి. - హైదరాబాద్/సికింద్రాబాద్/పద్మారావునగర్/ముషీరాబాద్/గండిపేట