రామప్ప టెంపుల్​లో ఉత్సవాలు అదుర్స్​.. వేలాదిగా పర్యాటకుల రాక

రామప్ప టెంపుల్​లో ఉత్సవాలు అదుర్స్​.. వేలాదిగా పర్యాటకుల రాక

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెంకటాపూర్‌‌(రామప్ప), వెలుగు :  యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో తొలిసారి వరల్డ్‌‌ హెరిటేజ్‌‌ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. సెంట్రల్‌‌ ఆర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌, తెలంగాణ టూరిజం శాఖ,  ప్రైవేట్‌‌ సంస్థల భాగస్వామ్యంతో  ‘శిల్పం.. వర్ణం.. కృష్ణం.. సెలబ్రేటింగ్ ది హెరిటేజ్’  పేరిట ఉత్సవాలు నిర్వహించారు. థమన్‌‌ మ్యూజికల్‌‌ నైట్‌‌ ఆకట్టుకోగా, రామప్ప విశిష్టతపై ప్రదర్శించిన లేజర్‌‌ షో  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జానపద నృత్యాలు, పేరిణి శివతాండవం  ఆకట్టుకున్నాయి. బలగం సినీ నటులు సందడి చేయగా, మంత్రులు శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌‌ హాజరయ్యారు.  సుమారు 10 వేల మంది పర్యాటకులు వేడుకల్లో పాల్గొన్నారు. 

ఫుడ్‌‌ ఫెస్టివల్‌‌.. మ్యూజికల్‌‌ నైట్‌‌

మంగళవారం ఉదయం 9 గంటలకు రామప్పలో ఫుడ్‌‌ ఫెస్టివల్‌‌ నిర్వహించారు. ములుగు జిల్లా డీఆర్‌‌డీఏ శాఖ ఆధ్వర్యంలో 30 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐజల్‌‌ వంటి స్వచ్ఛంద సంస్థలు పర్యాటకులకు  ఉచిత సేవలు అందించాయి. సాయంత్రం 5 గంటల తర్వాత మ్యూజిక్​ డైరెక్టర్​ ఎస్ఎస్ తమన్, డ్రమ్స్​ ప్లేయర్​ శివమణి, ఫ్లూటిస్ట్ నవీన్, సింగర్ కార్తీక్ తో పాటు 300 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సింగర్లు కార్తీక్‌‌, శ్రీ కృష్ణ, గీతా మాధురి పాటలకు పర్యాటకులు కేరింతలు కొట్టారు. బలగం చిత్ర దర్శకుడు వేణు యెల్ధండితో పాటు నిర్మాతలు నటీనటులు పాల్గొన్నారు. వీరికి  రాష్ట్ర మంత్రులు సన్మానం చేశారు. 

అబ్బురపరిచిన పేరిణి శివతాండవం  

ములుగు జిల్లా విశిష్టత, రామప్ప ఆలయంపై తయారు చేసిన ఏవీలను ప్రదర్శించారు. గోల్కొండ బుచ్చన్న ఆధ్వర్యంలో జానపద పాటలు, నృత్యాలు చేశారు. పేరిణి రాజ్‌‌కుమార్‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పేరిణి శివతాండవం ఆకట్టుకుంది. బెంగుళూరు నుంచి వచ్చిన అశోక్‌‌ గురజాల శిష్యబృందం 80 మంది ఒకేసారి వాయిలిన్‌‌ వాయించి శభాష్‌‌ అనిపించుకున్నారు. బెంగుళూరుకే చెందిన సూర్య ఎస్‌‌ రావు రావణసుర గెటప్‌‌పై చేసిన డ్యాన్స్​ భళా అనిపించింది. శ్రావ్య, మానస ఆధ్వర్యంలో 200 మంది డ్యాన్సర్లు నృత్యం చేశారు.  

భారీగా తరలివచ్చిన పర్యాటకులు

వేడుకలను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.  ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. అలాగే ప్రైవేట్‌‌ వెహికిల్స్‌‌లో వచ్చే భక్తుల కోసం పార్కింగ్‌‌ ఏర్పాటు చేశారు.  
హాజరైన ముగ్గురు మంత్రులురామప్పలో నిర్వహించిన వరల్డ్‌‌ హెరిటేజ్‌‌ డే ఉత్సవాలలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు.

సీఎం కేసీఆర్‌‌ ప్రత్యేకంగా దృష్టి సారించి రామప్పను డెవలప్‌‌ మెంట్‌‌ చేయనున్నారన్నారు. టెంపుల్‌‌ పరిసరాలను అభివృద్ధి చేయడానికి రూ.23 కోట్లు సాంక్షన్‌‌ చేసినట్లుగా ప్రకటించారు. ఎంపీ పసునూరి దయాకర్‌‌, జడ్పీ చైర్​పర్సన్లు జగదీశ్‌‌, గండ్ర జ్యోతి, వరంగల్‌‌ మేయర్‌‌ గుండు సుధారాణి, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌‌, ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్‌‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గాష్‌‌ ఆలం పాల్గొన్నారు.కాగా, సాయంత్రం వేడుకల సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ను స్టేజీపైకి పిలవకపోవడంతో అలిగి వెళ్లిపోయారు.