బంగారం మస్తు కొంటున్నరు : జనంతో కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్

బంగారం  మస్తు కొంటున్నరు : జనంతో కిటకిటలాడుతున్న గోల్డ్ షాప్స్
  • రేట్లు తగ్గడం, పెండ్లిల సీజన్ కావడంతో పెరిగిన సేల్స్ 
  • 60–70 శాతం పెరిగిన అమ్మకాలు 
  • కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో రూ.3 వేలకు పైగా తగ్గిన ధర 
  • ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్​ రేటు రూ.70,950 

హైదరాబాద్, వెలుగు: ఓవైపు రేట్లు తగ్గడం, మరోవైపు పెండ్లిల సీజన్ మొదలుకావడంతో జనం బంగారం మస్తు కొంటున్నారు. కస్టమర్లతో గోల్డ్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో రేట్లు కాస్త తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై రూ.3 వేల వరకు ధర తగ్గింది. గత నెల 23కు ముందు 10 గ్రాముల బంగారం ధర రూ.76 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.70,950కి దిగొచ్చింది. ఇలా రేట్లు తగ్గడంతో పాటు శ్రావణమాసం మొదలై పెండ్లిల సీజన్ రావడంతో బంగారం కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 

వరలక్ష్మి వ్రతాల కోసం కూడా జనం బంగారం కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త డిజైన్లతో పాటు 0.5 నుంచి 10 గ్రాముల దాకా గోల్డ్ కాయిన్స్ ని అందుబాటులోకి ఉంచినట్టు పేర్కొంటున్నారు. ‘‘ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గోల్డ్​సేల్స్ డౌన్ అయ్యాయి. ఆ తర్వాత మూఢాలతో గిరాకీ లేకుండా పోయింది. ఈసారి అక్షయ తృతీయకి కూడా సేల్స్​పెరగలేదు. ప్రస్తుతం రేట్లు తగ్గడం, పెండ్లిల సీజన్ కావడంతో గతంతో పోలిస్తే 60 నుంచి 70 శాతం సేల్స్ పెరిగాయి” అని వ్యాపారులు చెబుతున్నారు.  

ఈ నెలలో లగ్గాలే లగ్గాలు.. 

ఈ నెలలో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో లగ్గాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి తర్వాత ఇప్పటి వరకు ముహూర్తాలు లేవు. ఇప్పుడూ మూఢాలు పోవడంతో ఇన్నాళ్లు శుభలగ్నాల కోసం వెయిట్ చేసిన వారంతా ఈ నెలలో పెండ్లిలు పెట్టుకున్నారు. ఈ నెలలో ఆరేడు రోజులు మాత్రమే ముహూర్తాలు ఉండగా, ఆ తేదీల్లో లక్షల్లో పెండ్లిలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో పెండ్లిల కోసం స్తోమతను బట్టి సగటున ఒక్కొక్కరు దాదాపు 5 నుంచి 10 తులాలకు పైనే బంగారం కొనుగోలు చేస్తున్నారు.

బంగ్లాదేశ్ సంక్షోభంతో కొద్దిగా పెరిగి..  

కేంద్రం కస్టమ్​డ్యూటీ తగ్గించడంతో గోల్డ్​రేట్​తగ్గినప్పటికీ, ఇటీవల బంగ్లాదేశ్ తలెత్తిన సంక్షోభంతో రేటు కాస్తా పెరిగింది. బంగ్లాదేశ్ ఎఫెక్ట్ షేర్ మార్కెట్లపై పడడంతో అవి డౌన్ అయ్యాయి.  దీంతో చాలామంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేశారు.  దీంతో గోల్డ్ రేటు పెరిగింది. బడ్జెట్ కి ముందు 10 గ్రాముల బంగారం రూ.76 వేలు ఉండగా, బడ్జెట్ తర్వాత రూ.70 వేలకి దిగొచ్చింది. అయితే బంగ్లాదేశ్ ఇష్యూతో మళ్లీ రూ.73 వేలకు పెరిగింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్తా అదుపులోకి వస్తుండడంతో రేట్లు మళ్లీ తగ్గుతున్నాయి. 

సేల్స్ 60 శాతం పెరిగినయ్.. 

గత నెల వరకు బంగారం కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. కస్టమ్స్ డ్యూటీ తగ్గిన తర్వాత రేట్లు తగ్గాయి. ఇప్పుడు పెండ్లిల సీజన్ కూడా కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. గతంతో పోలిస్తే 60 శాతం సేల్స్ పెరిగాయి. ఈ నెలంతా ఇలాగే ఉండే అవకాశం ఉంది. 
-  రవికాంత్, మానేపల్లి జ్యువెలర్స్ 
బ్రాంచ్ మేనేజర్, పంజాగుట్ట