పీర్జాదిగూడలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలె : తోటకూర వజ్రేశ్ యాదవ్

పీర్జాదిగూడలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలె : తోటకూర వజ్రేశ్ యాదవ్

 మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ కార్పొరేషన్​లో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ ప్రశ్నించారు. ఓట్లు అడిగేందుకు వచ్చే బీఆర్ఎస్ నేతలను ఇదే విషయంపై నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. పీర్జాదిగూడలో అభివృద్ధి పేరుతో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 

పార్కు స్థలాలను బహిరంగంగా వేలం పెట్టి అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. కుంటలు కబ్జాకు గురవడంతో వానాకాలంలో కాలనీలు జలమయం అవుతున్నాయన్నారు. ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కోసం రూపొందించిన ఎస్​ఎన్డీపీ ప్రాజెక్టుకు సంబంధించి 5 శాతం పనులు కూడా కాలేదని.. ఇందుకు మేయర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లారెడ్డి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయాడని వజ్రేశ్ యాదవ్ మండిపడ్డారు. 

ప్రజా బలం ముందు మల్లారెడ్డి ధన బలం పనిచేయదని ఏఐఎస్ఎఫ్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా మల్లారెడ్డి..  జనం గురించి ఆలోచించలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పీర్జాదిగూడ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ రమేశ్​ పాల్గొన్నారు.