నర్సింగ్ రిక్రూట్ మెంట్లో తప్పంతా టీఎస్‌‌పీఎస్సీదే

నర్సింగ్ రిక్రూట్ మెంట్లో తప్పంతా టీఎస్‌‌పీఎస్సీదే
  • నర్సింగ్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌లో వెయిటేజీ మార్కులపై హెల్త్‌‌ ఆఫీసర్లు
  • రెండో రోజూ కొనసాగిన నర్సు క్యాండిడేట్ల ఆందోళనలు
  • అర్హులందరికీ మార్కులు కలుపుతామన్న డీహెచ్‌‌

హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ రిక్రూట్‌‌మెంట్‌‌కు సంబంధించి వెయిటేజీ మార్కుల విషయంలో మరోసారి తప్పు జరిగిందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అంగీకరించింది. సుమారు 60 మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌‌కు వెయిటేజీ మార్కులు కలవలేదని, టీఎస్‌‌పీఎస్సీ అధికారులు చేసిన తప్పిదమే దీనికి కారణమని హెల్త్ ఆఫీసర్లు తెలిపారు. తాము వెరిఫై చేసి ఇచ్చిన లిస్టులో ఉన్న క్యాండిడేట్స్‌‌కు మార్కులు తీసేశారని, ఇప్పుడు అడిగితే టెక్నికల్ ఎర్రర్ అంటున్నారని చెప్పారు. ఒకరిద్దరి విషయంలో తమ సైడ్‌‌ నుంచి కూడా పొరపాటు జరిగిందన్నారు. తమకు జరిగిన అన్యాయంపై రెండో రోజు బుధవారం కూడా బాధిత నర్సులు కుటుంబీకులతో వచ్చి హెల్త్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. న్యాయం చేయాలని హెల్త్ ఆఫీసర్లను ప్రాధేయపడ్డారు. నర్సులతో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు.

వాళ్లందరికీ మార్కులు కలుపుతం

ఎలిజిబిలిటీ ఉండి మార్కులు కలవని వాళ్లకు కలుపుతామని శ్రీనివాసరావు అన్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తం 70 మంది మార్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. కొంత మంది అప్లై చేసుకునే టైమ్‌‌లో సర్టిఫికెట్లు అప్‌‌లోడ్ చేయకపోవడంతో మార్కులు కలవలేదని, ఇలాంటి వాళ్ల విషయంలో తాము చేసేదేమీ లేదన్నారు. కొంతమందికి అకడమిక్ క్వాలిఫికేషన్ మార్కులు కలవలేదని, ఇది కూడా టీఎస్‌‌పీఎస్సీ వాళ్లే పరిశీలించాల్సిన అంశమని తెలిపారు. వెయిటేజీ మార్కుల విషయమే తమ పరిధిలో ఉందని, ఎలిజిబిలిటీ ఉండి సర్టిఫికెట్లు అప్‌‌లోడ్ చేసిన అందరికీ వెయిటేజీ మార్కులు కలుపుతామని చెప్పారు.

అకాడమిక్ వెయిటేజీలోనూ తప్పులే

నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచి ఏటా ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు అకడమిక్ వెయిటేజీ ఇస్తామని 2017లో ఇచ్చిన నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. కొంత మందికి ఈ మార్కులు కలపలేదు. ఇలాంటి వాళ్లు వందమందికి పైగా ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. వీళ్ల దగ్గర్నుంచి నవంబర్‌‌‌‌లోనే టీఎస్‌‌పీఎస్సీ అప్లికేషన్లు తీసుకున్నా మార్కులు కలపలేదు. ఇప్పుడైనా కలుపుతారో లేదో టీఎస్‌‌పీఎస్సీ స్పష్టత ఇవ్వలేదు.

ఉద్యోగం కోల్పోయే పరిస్థితి

నా నర్సింగ్ డిగ్రీ 2007లో పూర్తయింది. అప్లికే షన్‌‌ టైమ్‌‌లో అన్ని సర్టిఫికెట్లు అప్‌‌లోడ్ చేసినా ఒక్క మార్కూ కలపలేదు. ఎగ్జామ్‌‌లో నాకు వచ్చిన 27 మార్కులతో 8,423వ ర్యాంక్ వచ్చింది. అకడమిక్ వెయిటేజీకి సంబంధించిన 10 మార్కులు కలిస్తే 24 వందల కంటే తక్కువ ర్యాంక్‌‌ వస్తది. ఆ ర్యాంక్‌‌తో కచ్చితంగా జాబ్ వస్తది. ఆఫీసర్లు చేసిన తప్పులతో నేను ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది.

– వి. రజిత, నర్సు, నల్గొండ