కాంగ్రెస్​ పార్టీకి మరోసారి ఐటీ నోటీసులు

కాంగ్రెస్​ పార్టీకి మరోసారి ఐటీ నోటీసులు
  • రూ.1,800 కోట్లు కట్టాలంటూ ఆదేశాలు
  • ఐటీ నోటీసులపై కాంగ్రెస్ ఫైర్​
  • ఇది ‘ట్యాక్స్ టెర్రరిజం’ అంటూ ధ్వజం.. బీజేపీపై చర్యలు ఏవీ? 
  • ఆ పార్టీకి రూ. 4 వేల కోట్ల పెనాల్టీ వేయాలని డిమాండ్ 
  • ఇయ్యాల దేశవ్యాప్త నిరసనలు

న్యూఢిల్లీ: ఒక పక్క లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండగా.. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ. 270 కోట్లను ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఫ్రీజ్ చేసింది. రూ. 200 కోట్ల మేరకు పెనాల్టీ వేస్తూ ఐటీ శాఖ ఇచ్చిన ట్యాక్స్ నోటీసులను సవాల్ చేస్తూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా అది గురువారం రిజెక్ట్ అయింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు పార్టీ సిద్ధమైంది. కానీ ఆ మరునాడే ఐటీ శాఖ కాంగ్రెస్ కు మరో షాక్ ఇచ్చింది.

2017–18 నుంచి 2020–21 మధ్య కాలానికి గాను రూ. 1,823.08 కోట్ల ఇన్ కం ట్యాక్స్ కట్టాలంటూ తాజాగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పెనాల్టీ, వడ్డీతో కలిపి ఈ మేరకు మొత్తం డబ్బులు కట్టాలంటూ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఎన్నికల సమయంలో కావాలనే పార్టీని ఇబ్బందులు పెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా ఐటీ శాఖ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందంటూ ఆరోపించింది. కాగా, కాంగ్రెస్ ట్యాక్స్ రిటర్నులలో తప్పులు ఉన్నాయని, రూ. 200 కోట్ల పెనాల్టీ చెల్లించాలంటూ ఐటీ శాఖ ఫిబ్రవరిలో నోటీసులు ఇచ్చింది. పెనాల్టీ వసూలు కోసం పార్టీ ఖాతాలను స్తంభింపచేయాలని ఇన్ కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పెనాల్టీ కింద ఐటీ శాఖ రూ. 135 కోట్లు తీసుకుని, మిగతా మొత్తాన్ని ఫ్రీజ్ చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. గురువారం పార్టీ పిటిషన్​ను కోర్టు కొట్టివేసింది.   

చర్యలు తప్పవ్.. ఇది నా గ్యారంటీ: రాహుల్ 

కాంగ్రెస్​కు ఐటీ శాఖ తాజా నోటీసులపై పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కుట్రపూరితంగా బీజేపీకి సహకరించిన అధికారులపై కేంద్రంలో ప్రభుత్వం మారిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నాయి. ఈ సంస్థలు తమ పనిని సక్రమంగా చేసి ఉంటే సమస్యేమీ ఉండేది కాదు. కానీ ఈ సంస్థలు మరోసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నవారిపై కేంద్రంలో ప్రభుత్వం మారగానే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు ఎలా ఉంటాయంటే.. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పులు చేసే ధైర్యం ఎవరూ చేయకూడదు. ఇది నా గ్యారంటీ” అని రాహుల్ పేర్కొన్నారు.   

బీజేపీ సంగతేంటీ?: జైరాం రమేశ్  

కాంగ్రెస్​ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ట్యాక్స్ నోటీసులు పంపుతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘ఇది ట్యాక్స్ టెర్రరిజం. కాంగ్రెస్​పై దాడికి దీనిని వాడుతున్నారు. వెంటనే ఇది ఆపేయాలి” అని అన్నారు. బీజేపీ కూడా ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తోందని, ఆ పార్టీపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రూ. 4,617.58 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలంటూ ఐటీ శాఖకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఎలక్టోరల్ బాండ్ల స్కాం ద్వారా బీజేపీ రూ.8,200 కోట్లు సేకరించింది.

ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, పోస్ట్ రెయిడ్ బ్రైబ్స్, షెల్ కంపెనీల వంటి వాటిని వాడుకుని ఆ పార్టీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వసూళ్లకు పాల్పడింది” అని జైరాం ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం కొనసాగుతుందని, తమ గ్యారంటీలను దేశ ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మాకెన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్ల కాలానికి కాంగ్రెస్ ఫైల్ చేసిన ఇన్ కం ట్యాక్స్ రిటర్నులను రీఓపెన్ చేసి వేల కోట్లు పెనాల్టీ చెల్లించాలంటూ అక్రమంగా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ క్యాడర్​కు పిలుపునిచ్చారు.