స్టూడెంట్ల భవిష్యత్తుపై గందరగోళం

స్టూడెంట్ల భవిష్యత్తుపై గందరగోళం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి ఇంటర్మీడియెట్ కాలేజీల అఫిలియేషన్​పై అయోమయం  నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా, ఇంకా ప్రైవేటు కాలేజీల గుర్తింపు ప్రక్రియ ముగియలేదు.  ఇప్పటికీ 584  ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వలేదు.  నిబంధనల ప్రకారం చూస్తే ఆ కాలేజీలకు గుర్తింపు వస్తుందనే నమ్మకమూ లేదు. సర్కారు స్పెషల్ పర్మిషన్ ఇస్తేనే, ఆ కాలేజీలు కొనసాగే అవకాశముంది. దీంతో  వాటిలో చదువుతున్న లక్షన్నర మంది స్టూడెంట్ల భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది.  2022–23 విద్యా సంవత్సరానికి  ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల కోసం మార్చి నెలలో ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది.  ప్రక్రియ ప్రారంభమై ఐదు నెలలు దాటినా ఇప్పటికీ అఫిలియేషన్లు పూర్తి కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా1,582 ప్రైవేటు కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకూ 786 కాలేజీలకే ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. ఇంకా 584  కాలేజీలకు సరైన డాక్యుమెంట్లు లేవనే కారణంతో గుర్తింపు ఇవ్వలేదు. వాటిలో 457 కాలేజీలు మిక్స్ డ్ ఆక్యుపెన్సీ, ఫైర్​ సెఫ్టీ లేని భవనాల్లో కొనసాగుతున్నాయి. గత మూడేండ్లుగా ఆయా కాలేజీలకు ప్రభుత్వం స్పెషల్ పర్మిషన్ తో ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది సర్కారుకు ఇంటర్ బోర్డు ఈ కాలేజీల విషయమై లేఖ రాసింది. మరోపక్క ప్రైవేటు కాలేజీలూ సర్కారును కలిసి అనుమతి ఇవ్వాలని కోరాయి. అయితే ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

గుర్తింపు లేకుండానే అడ్మిషన్లకు అనుమతి

ప్రస్తుతం గుర్తింపులేని 584  కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లు పూర్తయి, క్లాసులు కొనసాగుతున్నాయి.  ఆయా కాలేజీల్లో లక్షన్నర మంది వరకూ స్టూడెంట్లు చదువుతున్నారు. గుర్తింపు లేకుండా కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు ఇంటర్ బోర్డు ఎందుకు అనుమతి ఇచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జూన్​ నెలాఖరు వరకైనా ఆ కాలేజీలకు గుర్తింపు లేదనే విషయాన్ని ప్రకటించినా తాము ప్రత్యామ్నాయం చూసుకునే వారమని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం మిక్స్​డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉండే కాలేజీల్లో కార్పొరేట్ విద్యా సంస్థలూ ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికైనా ఆ కాలేజీలకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మేనేజ్​మెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా సర్కారు నుంచి కాలేజీల అఫిలియేషన్​పై క్లారిటీ తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. తాను హోం శాఖ సెక్రటరీతో మాట్లాడానని, త్వరలోనే క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. సర్కారు ఆదేశాల మేరకు ముందుకు పోతామని వెల్లడించారు. 

అఫిలియేషన్లు ఇవ్వాలి

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ, ఫైర్  సేఫ్టీ నిబంధనలు ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మాత్రమే పెట్టారు. ప్రభుత్వం ఇలా నిబంధనల పేరుతో మేనేజ్​మెంట్లను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు. ఇంటర్ బోర్డు ఆపేసిన పలు కాలేజీలకు వెంటనే అఫిలియేషన్లను ఇవ్వాలి. 

- గౌరీ సతీశ్‌‌‌‌, ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్