
- ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపులో ఫెయిల్ అయినట్లు క్యాడర్ నుంచి విమర్శలు
- అంబర్‌పేటలో గెలిపించుకోలేని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
- ముషీరాబాద్‌ను దక్కించుకోలేని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
- జనాల్లో ఆదరణ ఉన్నా సద్వినియోగం చేసుకోలే
- పలు నియోజకవర్గాల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంక్
హైదరాబాద్,వెలుగు : గ్రేటర్ సిటీలో బీజేపీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. పార్టీ నుంచి జాతీయస్థాయికి ఎదిగిన నేతలు కూడా ఉన్నారు. కానీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శలు క్యాడర్ నుంచి ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే బీజేపీ అడ్డా అన్నట్టుగా పార్టీ వెలిగింది. ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది. కేంద్ర మంత్రులు, బీజేపీ అధికారంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వంటి అగ్రనేతలు ప్రచారం చేశారు.
ఒక్క గోషామహల్లో రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. జాతీయనేతల ప్రచారంతో సిటీలో కమలం పార్టీకి సానుకూల పవనాలే వీచాయి. కానీ రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయినట్టు స్పష్టమవుతోంది. గతంలో పార్టీ సీనియర్‌నేత దివంగత బద్ధం బాల్ రెడ్డి హయాంలో బీజేపీ అంటేనే మజ్లిస్హడలిపోయే పరిస్థితి ఉండేది. ఆయన 1985,1989,1994 ఎన్నికల్లో కార్వాన్‌నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.
మరో నేత దివంగత ఎ. నరేంద్ర కూడా పార్టీకి బలమైన నేతగా కొనసాగారు. టైగర్ నరేంద్రగా రాజకీయాల్లో ముద్రపడ్డారు. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది. ఈసారి బీజేపీకి ఓట్ల శాతం పెరిగినట్లు ఫలితాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు దీటుగా బలం పెరిగినా సరైన నాయకత్వం లేక, అభ్యర్థుల ఎంపికలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా సీట్ల సంఖ్య పెరగలేదు.
ఒక్క సిట్టింగ్ఎమ్మెల్యే రాజాసింగ్ హ్యాట్రిక్ సాధించారు. ఆయన గెలుపులోనూ పార్టీ నేతల కంటే సొంత ఇమేజ్ఎక్కువగా పని చేసింది. కేంద్రంలో అధికారంలో ఉండి, సిటీలో బీజేపీకి పట్టుండి కూడా ఒక్కసీటుకే పరిమితం కావడంపై అగ్రనేతలపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
సొంత సెగ్మెంట్లలోనే ఓటమి
బీజేపీకి సీట్ల సంఖ్యపెరగక పోవడం ఆ పార్టీ అగ్రనేతల వైఫల్యమేనని క్యాడర్ విమర్శిస్తుంది. సిటీకి చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి 2014లో అంబర్‌పేట నుంచి గెలుపొందారు. 2018లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2019 పార్లమెంట్ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. అనంతర పరిణామాల తర్వాత కిషన్‌రెడ్డి రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి పార్టీ అభ్యర్థిగా కృష్ణాయాదవ్‌ను గెలిపించుకోలేకపోయారు.
ముషీరాబాద్‌కు చెందిన కె. లక్ష్మణ్పార్టీలో జాతీయస్థాయినేతగా ఎదిగారు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, జాతీయ ఓబీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ తన సెగ్మెంట్ ముషీరాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. దీన్ని ఆయన అవమానకరంగానే భావించారు.
మరో ముఖ్యనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ 2014లో ఉప్పల్‌నుంచి విజయం సాధించారు. కానీ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిచెందారు. ఇలా సిటీ నుంచి జాతీయస్థాయికి ఎదిగిన నాయకులు ఉన్నా కూడా అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెరగకపోవడం ఆ పార్టీ అగ్రనేతల తీరును సూచిస్తోంది. గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై కూడా వారు పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంపై పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.