క్రికెటర్ త్రిషకు కోటి నజరానా.. ఇవాళ (ఫిబ్రవరి 6) సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్

క్రికెటర్ త్రిషకు కోటి నజరానా..  ఇవాళ (ఫిబ్రవరి 6) సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్

పాల్గొననున్న స్టేట్ ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, 
డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.  ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను జనంలోకి తీసుకెళ్లడం, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయంపైనా చర్చించనున్నారు.

క్రికెటర్ త్రిషకు కోటి నజరానా

క్రికెటర్ త్రిషకు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. జూబ్లీహిల్స్ తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఈ నజరానాను అందజేశారు. మహిళా క్రికెటర్ గొంగడి త్రిష బుధవారం సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను సీఎం అభినందించారు. భవిష్యత్తులో దేశం తరఫున మరింతగా రాణించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అండర్19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ తెలంగాణ కు చెందిన ధృతి కేసరి కి రూ.10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.