వన్డే వార్: పాక్‌ పయనం ఎందాక!

వన్డే వార్: పాక్‌ పయనం ఎందాక!

ఇమ్రాన్‌‌‌ ఖాన్‌‌, వసీం అక్రమ్‌‌, వకార్‌‌ యూనిస్‌‌, మియాందాద్‌‌.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌‌ను ఆకర్షించిన లెజెండ్స్‌‌. తమ ఆటతీరుతో ఎన్నో అద్భుతాలు చేసిన ప్లేయర్లు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో, ఆ తీవ్రతతో క్రికెట్‌‌ ఆడే ఆటగాళ్లు పాక్‌‌ జట్టులో వెతికినా దొరకరు. కారణాలేమైనా ప్రస్తుతం పాకిస్థాన్‌‌ క్రికెట్‌‌లో ఓ రకమైన సంధి కాలం నడుస్తున్నది. మాజీలను మైమరిపించే స్థాయిలో కొత్త ఆటగాళ్లు రావడం లేదు. ఒకరిద్దరు వచ్చినా.. వివాదాలకు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారుతున్నారు. అందుకే ఆ జట్టు ఫెర్ఫామెన్స్‌‌లో నిలకడ లోపించింది. 2015 మెగా ఈవెంట్‌‌లో క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరిన పాక్‌‌.. ఆ తర్వాత జరిగిన ఏ సిరీస్‌‌ల్లోనూ పెద్దగా రాణించలేదు. కానీ అనూహ్యంగా, ఆశ్చర్యంగా 2017లో ఇంగ్లండ్‌‌లో జరిగిన చాంపియన్స్‌‌ ట్రోఫీలో మేటి జట్లను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత కథ మామూలే. అయినా ఈ వరల్డ్‌‌కప్‌‌లో పాక్‌‌ను ఫేవరెట్‌‌గానే చెబుతున్నారు. ఎందుకంటే ఆ జట్టులో నాణ్యమైన బ్యాట్స్‌‌మెన్‌‌కు కొదువలేదు. అవకాశం కోసం కుర్రాళ్లు వేచి చూస్తున్నారు. టార్గెట్‌‌ ఛేదించడంలోనూ దిట్టగానే కనిపిస్తున్నారు. బలహీనతలను అధిగమిస్తే.. కచ్చితంగా ప్రభావం చూపే టీమ్‌‌ అని విశ్లేషకుల వాదన. ఆమిర్‌‌, రియాజ్‌‌ రాకతో జట్టులో బలం పెరిగినా.. ఓపెనింగ్‌‌ పేసర్‌‌ ఉస్మాన్‌‌ ఖాన్‌‌ షేన్వారి అందుబాటులో లేకపోవడం లోటు.

ఇదీ బలం..

పాకిస్థాన్‌‌కు అతిపెద్ద బలం టాప్‌‌ ఆర్డర్‌‌. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు పేస్‌‌ బౌలింగ్‌‌తో బెంబేలెత్తించిన దాయాది జట్టు ఇప్పుడు మాత్రం పూర్తిగా బ్యాటింగ్‌‌పైనే ఆధారపడింది. ఇటీవల ఇంగ్లండ్‌‌లో జరిగిన మూడు మ్యాచ్‌‌ల్లో 340లకు పైగా స్కోరు సాధించడమే ఇందుకు నిదర్శనం. గతేడాది జూన్‌‌ నుంచి ఫస్ట్‌‌ చాయిస్‌‌ టాప్‌‌–3 బ్యాట్స్‌‌మెన్‌‌లో ఫఖర్‌‌ జమాన్‌‌, బాబర్‌‌ ఆజమ్‌‌, ఇమాముల్‌‌ హక్‌‌ ముందున్నారు.  వ్యక్తిగతంగా భారీ స్కోర్లు చేస్తూ చాలా సందర్భాల్లో వీళ్లు పాక్‌‌ను ఒంటిచేత్తో గెలిపించారు. గత 24 మ్యాచ్‌‌ల్లో ఇమామ్‌‌ 61 సగటుతో 1238 పరుగులు చేశాడు. జమాన్‌‌ కూడా నాలుగంకెల స్కోరు అందుకున్నాడు. ఆరంభంలో వీళ్లు వేసే బలమైన పునాదిపై పాక్‌‌ మిడిల్‌‌, లోయర్‌‌ ఆర్డర్‌‌ చెలరేగిపోతున్నది.  మిడిలార్డర్‌‌లో సర్ఫరాజ్‌‌, హఫీజ్‌‌, ఆసిఫ్‌‌ అలీ, షోయబ్‌‌ మాలిక్‌‌, హారిస్‌‌ సోహైల్‌‌ దుర్భేద్యంగా కనిపిస్తున్నారు.  క్లిష్ట పరిస్థితుల్లో వీళ్లలో ఎవరో ఒకరు జట్టును ఆదుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.  ఓ రకంగా చెప్పాలంటే ఇంగ్లండ్‌‌.. పాక్‌‌కు కలిసొచ్చిన వేదిక. 2009లో టీ20 వరల్డ్‌‌కప్‌‌, 2017లో చాంపియన్స్‌‌ ట్రోఫీని గెలిచింది ఇక్కడే. మిగతా జట్లతో పోలిస్తే పాక్‌‌కు ఇక్కడ మ్యాచ్‌‌ ప్రాక్టీస్‌‌ కూడా ఎక్కువే. ఇది కలిసొచ్చే అంశం.  గత 12 నెలల నుంచి స్పిన్నర్లు కూడా మంచి టచ్‌‌లోనే ఉన్నారు. షాదాబ్‌‌ ఖాన్‌‌ 23, షాహీన్​ షా ఆఫ్రిది 22 వికెట్లు తీశారు.కానీ, ఇంగ్లిష్‌‌ వికెట్లపై వీళ్ల ప్రభావం తక్కువే ఉండొచ్చు.

బలహీనత…

ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన పేస్‌‌ బలం ఇప్పుడు పాక్‌‌కు లేదు. ఏ టోర్నీలోనైనా పేసర్లతోనే విరుచుకుపడే ఆ జట్టు ఇప్పుడు దాని గురించి చాలా తక్కువగా మాట్లాడుతోంది. ఆమిర్‌‌ రాకతో పేస్‌‌లో కాస్త పదును పెరిగినా.. ఒకప్పటి స్థాయిని అందుకోవడం కష్టమే. నాణ్యమైన బౌలర్ల కొరతతో ఒక్కోసారి 350+ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోతున్నది. మరో అతిముఖ్యమైన పాయింట్‌‌.. ఫీల్డింగ్‌‌. షార్ప్‌‌ సింగిల్స్‌‌ను అడ్డుకోవడం, క్యాచ్‌‌లు పట్టడం, కీలక సమయాల్లో బ్యాట్స్‌‌మన్‌‌ను రన్‌‌ కోసం ప్రయత్నించకుండా చేసే అద్భుతమైన ఫీల్డర్‌‌ జట్టులో వెతికినా దొరకడు. దీనిని అధిగమించడం కెప్టెన్‌‌గా సర్ఫరాజ్‌‌కు తలకు మించిన భారం. బ్యాట్స్‌‌మన్‌‌, ఫీల్డింగ్‌‌ పొజిషన్‌‌కు తగ్గట్టుగా బౌలింగ్‌‌ చేసే బౌలర్‌‌ లేడంటే అతిశయోక్తి కాదు. ఫీల్డర్లను పదేపదే మార్చడం వల్ల స్లో ఓవర్‌‌ రేట్‌‌ నమోదుకావడం, సర్ఫరాజ్‌‌ జరిమానా ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. ఆమిర్‌‌ వచ్చినా అతనికి జునైద్‌‌ ఖాన్‌‌, హసన్‌‌ అలీ నుంచి పెద్దగా సహకారం లభించడం కష్టమే. వీళ్లందరూ కలిసి ఈ మధ్యకాలంలో పాక్‌‌ను గెలిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి. మొత్తానికి పేస్‌‌లో బలం లేదు.. స్పిన్‌‌లో వైవిధ్యం కనిపించదు. గత నాలుగు వన్డేల్లో 350కి పైగా స్కోరు ఇచ్చారంటే బౌలింగ్‌‌ ఎంత బలహీనమో అర్థమవుతుంది.

కీలక ఆటగాడు.. హఫీజ్‌‌…

ఇంగ్లిష్‌‌ వాతావరణ పరిస్థితుల్లో పెద్దగా రాణించకపోయినా.. ఇప్పుడున్న జట్టులో మహ్మద్‌‌ హఫీజే కీలకం. నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చే అతను లైనప్‌‌లో స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. అవసరమైతే బౌలింగ్‌‌తోనూ జట్టుకు ఉపయోగపడతాడు.  అతని వన్డే కెరీర్‌‌ను చూస్తే 33 సగటుతో 6 వేల పరుగులు, 137 వికెట్లు తీశాడు. జట్టుకు అవసరమైనప్పుడు గొప్ప ఫెర్ఫామెన్స్‌‌ చూపడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆల్‌‌రౌండర్‌‌గా నిలకడ చూపెడితే ఈ కప్‌‌లో పాక్‌‌ అదృష్టం మారినట్లే. అంచనాలను అందుకుంటే సెమీస్‌‌ దాకా రావచ్చు.