మొహర్రం ఊరేగింపులో విషాదం..విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి..24 మందికి గాయాలు

మొహర్రం ఊరేగింపులో విషాదం..విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి..24 మందికి గాయాలు

బీహార్ మొహర్రం వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం (జూలై5) సాయంత్రం దర్బంగా జిల్లాలోని కాకోర్హాలో  మొహర్రం ఊరేగింపులో విద్యుత్ షాక్ తో ఒకరు మృతిచెందగా, 24మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజియాలోని ఓ భాగం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

మరోవైపు ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా వేర్వేరు వర్గాలకు చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

బరియార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరీహార్ ప్రాంతం గుండా ఊరేగింపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) సుశీల్ కుమార్ తెలిపారు.

రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం తరువాత ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు వెంటనే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు .తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది