
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది.. గురువారం ( మే 8 ) జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి విరాలిలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ దగ్గర కారు బ్రేక్ డౌన్ అయ్యి టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను ఢీకొట్టింది టయోటా కారు. దీంతో అమాంతం గాలిలో ఎగిరిపడ్డాడు డ్రైవర్.
కారు మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు డ్రైవర్. ఈ ఘటనలో మరొకరు గాయపడగా.. చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు కార్లు నుజ్జునుజ్జయినట్లు సమాచారం. హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కారు హిమాయత్ సాగర్ ఎగ్జిట్ 17 దగ్గరకు చేరుకోగానే సడన్ గా ఆగిపోయిందని.. వెంటనే ఔటర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. రికవరీ వ్యాన్ వచ్చిందని.. బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ మారుస్తుండగా అటు నుంచి టయోటా కారు మితిమీరిన వేగంతో వచ్చి డీకొనిందని బాధితుడు తెలిపాడు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు స్పాట్ కి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.