
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీలపై బీజేపీ మహా ధర్నా చేపట్టింది. మార్చి 25వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేపట్టింది బీజేపీ. పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పేపర్ లీకేజీలతో అన్నీ పరీక్షలు రద్దు చేశారని.. 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టారు. అవి పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు బీజేపీ శ్రేణులు.
బీజేపీ డిమాండ్లు ఇవే :
- TSPSC ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
- మరో డిమాండ్ పరిశీలిస్తే.. TSPSC పేపర్ లీకేజీపై సిట్ విచారణ సరిపోదని.. సిట్ పై నమ్మకం లేదని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.
- మరో ప్రధానమైన డిమాండ్ చూస్తే.. TSPSC పరీక్షలు రాసి నష్టపోయిన అభ్యర్థులు, నిరుద్యోగులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలి డిమాండ్ చేస్తోంది బీజేపీ..
ఉద్యోగాలు వదిలేసి.. సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకున్నారని.. ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీ వల్ల అందరూ నష్టపోయారని.. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని.. అభ్యర్థులు అందరికీ, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ..